షాబాద్, సెప్టెంబర్ 8 : విల్లాలు, కాలనీల్లో ముంపు సమస్య శాశ్వతంగా ఉండొద్దంటే ప్రభుత్వం వెంటనే ఎస్ఎన్డీపీ సెకండ్, థర్డ్ ఫేస్‌లను పూర్తి చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ళ సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆమె శంకర్పల్లి మండలం, మోకిలలోని లా ఫాలోమా విల్లాస్‌ను, అక్కడి ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మోకిల లా ఫాలోమా విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ జలమయ మైందన్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.
ముప్పు సమస్యపై ఆమె ఫోన్లో అధికారులతో మాట్లాడారు. గతంలో తన నియోజకవర్గంలో చిన్న చెరువులు, కుంటలు చాలా ఉండేవని.. అయితే ఇప్పుడు విల్లాలు, వెంచర్లు వెలియడంతో నాలాల కబ్జాలు, కుంచించుకుపోవడంతో వర్షపు నీరు సాఫీగా వెళ్లకుండా కాలనీల్లోని ఇండ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందుల పాలు కావొద్దనే సదుద్దేశంతోనే అప్పటి సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో.. మాజీ మంత్రి కేటీఆర్ డైరెక్షన్లో ఎస్ఎన్డీపీ నిర్మాణానికి పూనుకోవడం జరిగిందన్నారు.
గతంలో వర్షాలతో ఇబ్బందులు పడిన దాదాపు రెండు వేల కాలనీలు.. ఎస్ఎన్డీపీ నిర్మాణం తర్వాత ప్రస్తుతం సేఫ్ జోన్లో ఉన్నాయని సబితారెడ్డి తెలిపారు. రెండో విడత ఎస్ఎన్డీపీ నిర్మాణాన్ని ప్రభుత్వం హైదరాబాద్ వరకే తీసుకున్నట్లు సమాచారం ఉందని.. అందువల్ల మూడోవిడతను శంకర్పల్లి వరకు తీసుకొస్తే ఇక్కడి కాలనీలవాసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఎస్ఎన్డీపీతో చెరువులు, కుంటలు కబ్జాలు కావన్నారు. మోకిలలో ఎస్ఎన్డీపీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని విల్లాలు సేఫ్‌గా ఉండాలంటే ఎస్ఎన్డీపీ ఏర్పాటు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఆమె వెంట నాయకులు రాజూనాయక్, గోవర్ధ్దన్‌రెడ్డి, కాలనీవాసులు తదితరులు ఉన్నారు.