దేశంలోనే అత్యధిక తలసారి ఆదాయాన్ని నమోదు చేసి రంగారెడ్డి జిల్లా రికార్డు సృష్టించింది. దీంతోపాటు అనేక రంగాల్లోనూ ప్రథమ స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్ర గణాంక శాఖ నివేదిక-2022ను బుధవారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం… గ్రేటర్ పరిధిలోని జిల్లాలు తలసరి ఆదాయంలోనే కాదు, స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి (జీడీడీపీ)లోనూ అగ్రస్థానంలో నిలిచాయి.
తెలంగాణ జీడీడీపీ రూ.9,61,800 కోట్లుగా ఉంటే… అందులో సుమారు 21 శాతం అంటే రూ. 1,98,997 కోట్లు ఒక్క రంగారెడ్డి జిల్లాదే కావడం విశేషం. ఇదొక్కటే కాదు పౌల్ట్రీ, పాలు, మాంసం ఉత్పత్తిలోనూ రంగారెడ్డిదే హవా కావడం గమనార్హం. మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అక్షరాస్యతలో 83.2 శాతంతో అగ్రస్థానంలో నిలువగా… రెండో స్థానంలో గ్రేటర్ పరిధిలోని మేడ్చల్-మల్కాజిగిరి ఉన్నది. మరోవైపు వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం, జీడీపీ గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం జిల్లా తలసరి ఆదాయం రూ.1,31,962 కాగా, జీడీపీ రూ.14,345 కోట్లుగా ఉన్నది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 25 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్..తెలంగాణ రాజధాని ప్రాంతమే కాదు.. రాష్ట్ర ఆర్థిక రంగానికి గుండెకాయ. అందుకే గ్రేటర్ పరిధిలోని జిల్లాలు తలసరి ఆదాయంలోనే కాదు.. స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి (జీడీడీపీ)లోనూ అగ్రస్థానంలో నిలిచాయి. ముఖ్యంగా దేశంలోనే అత్యధిక తలసారి ఆదాయాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించిన రంగారెడ్డి జిల్లా ఇలా అనేక రంగాల్లోనూ ప్రథమ స్థానంలో నిలిచింది.
తెలంగాణ రాష్ట్ర గణాంక శాఖ నివేదిక-2022ను బుధవారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం..రాష్ట్ర ఆర్థిక, ఉపాధి రంగాలకు ఆయువు పట్టుగా నిలిచే పారిశ్రామిక రంగంలో గ్రేటర్ పరిధిలోని మేడ్చల్-మల్కాజిగిరి మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అక్షరాస్యతలో 83.2 శాతంతో నిలవగా..రెండో స్థానంలో గ్రేటర్ పరిధిలోని మేడ్చల్-మల్కాజిగిరి ఉంది. తాజా నివేదికలో ఇలాంటి ఆసక్తికర అంశాలెన్నో ఉన్నాయి.
రికార్డు సృష్టించిన రంగారెడ్డి…
తలసరి ఆదాయంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు..దేశంలోని అనేక మెట్రో నగరాలు ఉన్న జిల్లాలను వెనకకు నెట్టేసి రికార్డు సృష్టించింది రంగారెడ్డి జిల్లా. ఈ క్రమంలో తాజా నివేదికలో వెల్లడించిన 2020-21 తలసరి ఆదాయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే అధికంగా రంగారెడ్డి రూ.6,69,102తో మొదటి స్థానంలో ఉంది. ఆతర్వాత స్థానంలో హైదరాబాద్ ఉండగా..మూడో స్థానంలో మేడ్చల్-మల్కాజిగిరి నిలిచింది.
తలసరి ఆదాయం 2020-21 : (రూ.కోట్లల్లో)
తెలంగాణ : 2,31,103
రంగారెడి : 6,69,102
హైదరాబాద్ : 3,49,061
మేడ్చల్-మల్కాజిగిరి : 2,09,838
21 శాతం రంగారెడ్డిదే..
గణాంక శాఖ నివేదిక ప్రకారం..తెలంగాణ జీడీడీపీ రూ.9,61,800 కోట్లుగా ఉంటే..అందులో సుమారు 21 శాతం అంటే రూ.1,98,997 కోట్లు ఒక్క రంగారెడ్డి జిల్లాదే కావడం విశేషం. ఇదేకాదు..గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలు రంగారెడ్డిని అనుసరించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో జీడీడీపీ జాబితాలో మొదటి వరుసన గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాలు ఉన్నాయి.
స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి ప్రస్తుతం ఇలా.. : (రూ.కోట్లల్లో)
తెలంగాణ రాష్ట్రం : 9,61,800
రంగారెడ్డి : 1,98,997
హైదరాబాద్ : 1,62,565
మేడ్చల్-మల్కాజిగిరి : 62,506
ఆసరా పింఛన్ల పంపిణీలో రెండో స్థానం..
ఆసరా పింఛన్ల లబ్ధిదారుల విషయంలో హైదరాబాద్ జిల్లా రెండో స్థానంలో ఉన్నట్లు రాష్ట్ర గణాంకాల శాఖ అధికారులు వెల్లడించారు. అందులో భాగంగా.. మొత్తం ఆసరా పింఛన్ల లబ్ధిదారులు 2,64,368 ఉన్నట్లు లెక్కలు తేల్చారు.
రాష్ట్ర పౌల్ట్రీలో అగ్రస్థానం..
రంగారెడ్డి జిల్లా పౌల్ట్రీ రంగంలోనూ అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీలో ఏకంగా 30 శాతం బర్డ్స్ రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉండటం విశేషం. ఈ రంగంలో తర్వాతి స్థానాల్లో సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, నల్లగొండలు ఉన్నాయి.
మూడు జిల్లాల పరిధిలోని మూగజీవాల సంఖ్య ఇలా…
జిల్లా : పౌల్ట్రీ : గొర్రెలు : మేకలు
హైదరాబాద్: 24,699 : 13,231: 33,876
రంగారెడ్డి :2,40,69,700 7,67,125 : 2,56,632
మేడ్చల్-మల్కాజిగిరి :39,58,098 :1,49,401 :40,020
ఇటు గుడ్లు.. అటు మాంసం..
బలవర్ధకమైన ఆహార ఉత్పత్తిలోనూ రంగారెడ్డి జిల్లా తన మొదటి స్థానాన్ని నిలుపుకుంది. ముఖ్యంగా పాలు, గుడ్లు, మాంస ఉత్పత్తిలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనక్కి నెట్టింది. ముఖ్యంగా పౌల్ట్రీ రంగంలో అగ్రభాగాన ఉన్న రంగారెడ్డి జిల్లా గుడ్ల ఉత్పత్తిలోనూ అదే ఒరవడి కొనసాగించింది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గుడ్లలో ఏకంగా 41 శాతం గుడ్లు కేవలం రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉత్పత్తి అవుతుండటం రికార్డు. మరోవైపు మాంస, పాల ఉత్పత్తిలోనూ రంగారెడ్డి అన్ని జిల్లాల కంటే ముందున్న రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పాలలో 12.13 శాతం, మాంసంలో 15 శాతం మేర భాగస్వామ్యాన్ని అందిస్తుంది.
విద్యార్థుల నమోదులో టాప్..
గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తిలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో రంగారెడ్డి నిలువగా.. మూడో స్థానంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉన్నట్లు గణాంక శాఖ వివరాలు వెల్లడించింది.
హైదరాబాద్లో 135 శాతం, మేడ్చల్ మల్కాజిగిరిలో 159 శాతం, రంగారెడ్డిలో 173 శాతం నమోదైంది. ప్రాథమికోన్నత పాఠశాల విషయానికొస్తే.. హైదరాబాద్లో 122, మేడ్చల్ మల్కాజిగిరిలో 161, రంగారెడ్డిలో 178 గ్రాస్ ఎన్రోల్మెంట్ నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో మెరుగైన స్థానంలో ఉంది. జీఈఆర్లో ప్రాథమికోన్న పాఠశాలల్లో 178 శాతం, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 173 శాతం, హైస్కూళ్లలో 144 శాతం ఉంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 136 శాతం నమోదైంది.
ప్రాథమికోన్నత పాఠశాలల్లో..
హైదరాబాద్లో 1-10వ తరగతికి కలిపి మొత్తం 8,26,636 మంది విద్యార్థులు నమోదయ్యారు. అలాగే రంగారెడ్డిలో 6,85,673 మంది, మేడ్చల్ మల్కాజిగిరిలో 6,24,103 మంది విద్యార్థులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
మూడు జిల్లాల్లోని స్కూళ్ల వివరాలు..
హైదరాబాద్ జిల్లాలో 1-10 తరగతికి సంబంధించి పాఠశాలలు మొత్తం 2929 వరకు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 2878 స్కూళ్లు ఉన్నాయి. మేడ్చల్ మల్కాజగిరిలో 2045 స్కూళ్లు ఉన్నాయి.
అక్షరాస్యతలో హైదరాబాద్ టాప్..
అక్షరాస్యతలో హైదరాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 83.2 శాతం అక్షరాస్యతతో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. జిల్లాలో 28,92,155 మంది అక్షరాస్యులు ఉన్నారు. స్త్రీలు (13,49,4677)9.3 శాతంతో మొదటి స్థానంలో ఉంది. మేడ్చల్ జిల్లా సైతం 82.5శాతం అక్షరాస్యతతో రెండో స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా 15,29,945 మంది అక్షరాస్యతతో(71.9 శాతం) నాలుగో స్థానంలో నిలిచింది.