వికారాబాద్, అక్టోబర్ 26: మారుమూల గ్రామాల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న చోట బాల్య వివాహాలు జరుగుతున్నాయి. వీటిపై బాలికలకు అవగాహన లేక వివాహాలు చేసుకుని రక్తహీనత వంటి పలు సమస్యలతో రోగాల బారిన పడుతున్నారు. అవగాహనతోనే బాల్యవివాహాలను నియంత్రించొచ్చని.. బాల్య వివాహాలతో బాలికల్లో శారీరక, మానసిక ఇబ్బందులు కలిగి తీవ్ర ఇబ్బందులు పడుతారని వైద్యులు పేర్కొంటున్నారు. అమ్మాయిలకు 18 ఏండ్లు, అబ్బాయిలకు 21 ఏండ్లు నిండిన తర్వాతే వివాహాలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయని వారు సూచిస్తున్నారు. వికారాబా ద్ జిల్లాలో బాల్యవివాహాల నియంత్రణకు అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. వారితోపాటు గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేసిన కమిటీలు కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయి.
ప్రత్యేక బృందాలతో అవగాహన..
విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలు, ఫంక్షన్‌హాళ్లు, గ్రామాల్లో ప్రత్యేక బృందాలతో అవగాహన కార్యక్రమాలను అధికారులు నిర్వహిస్తున్నారు. బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా చైల్డ్‌లైన్ ఆధ్వర్యంలో కర పత్రా లు, వాల్ పోస్టర్లతో ప్రజల్లో బాల్యవివాహాలపై అవగాహన కల్పిస్తున్నారు. డయల్100, 181, 1,098, పోలీస్ కళాబృందాలు గ్రామాలు తిరుగుతూ ఆటాపాటలతో ప్రజలకు బాల్యవివాహాలు చేస్తే కలిగి నష్టాలపై వివరిస్తూ.. వారిలో మార్పు తీసుకొస్తున్నాయి. మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు గ్రా మాల్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నా రు. 18 ఏండ్లు నిండిన తర్వాత అమ్మాయిలకు వివాహం చేయాలని.. తద్వారా వారు ఆరోగ్యం గా ఉండటంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వర్తిస్తాయని సూచిస్తున్నారు. అమ్మాయికి కల్యాణలక్ష్మి కింద రూ.1,00,116 ప్రభుత్వం అందిస్తుందని తెలుపుతున్నారు. చైల్డ్‌లైన్, పోలీసులు, సఖీ, మహిళా, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో జిల్లాలో బాల్యవివాహాలు చాలా వరకు తగ్గడంతోపాటు రాష్ట్రంలోనే వికారాబాద్ జిల్లా బాల్య వివాహాల నిర్మూలనలో మొదటి స్థానం లో నిలిచింది. దీంతో జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కట్టడిలో జిల్లా ఫస్ట్..
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలాఖరువరకు ఆరు నెలల కాలంలో బాల్యవివాహాల కట్టడికి తీసుకున్న చర్యలు, సాధించిన ప్రగతిని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని డీడబ్ల్యూవోల నుంచి జాతీయ బాలల హక్కుల కమిషన్ నివేదికలను సేకరించింది. వికారాబాద్ జిల్లాలోని అధికారులు తీసుకున్న చర్యలతో చాలావరకు బాల్యవివాహాలు తగ్గినట్లుగా ఆ కమిషన్ సభ్యు లు గుర్తించడంతో రాష్ట్రంలోనే జిల్లాకు మొదటి స్థానం లభించింది. 1,098, 181, డయల్ 100కు బాల్యవివాహాలపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. గ్రామ, మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లోనూ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తద్వారా ప్రజల్లో వచ్చిన చైతన్యంతో ఇప్పటివరకు జిల్లాలో 157 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. పూజారులు, చర్చిపాస్టర్లు, మత పెద్దలతో ప్రత్యే క సమావేశాలు ఏర్పాటు చేసి బాల్య వివాహాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో 157 బాల్య వివాహాలను అడ్డుకున్నాం
బాల్యవివాహాల నియంత్రణకు ఐసీడీఎస్, పోలీసులు, సఖీ, అంగన్వాడీ టీచర్లు, గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు, చర్చిపాస్టర్లు, మత పెద్దలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారికి అవగాహన కల్పించం. జిల్లాలో ఇప్పటివరకు 157 బాల్య వివాహాలను అడ్డుకున్నాం. బాలిక తల్లిదండ్రులకు వివాహం చేయడం వల్ల కలిగే నష్టాలను వివరించి, కౌన్సెలింగ్ ఇవ్వడంతో అమ్మాయిలకు 18 ఏండ్లు నిండిన తర్వాతే వివాహాలు చేస్తామని రాత పూర్వకంగా రాసి ఇచ్చారు. అమ్మాయిలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించి చదువుపై దృష్టి సారించేలా వారిని కేజీబీవీలు, చిల్డ్రన్ హోంల్లో ఉంచి చదివిస్తున్నాం. బాల్యవివాహాలు చేస్తే చట్టపరంగా ఏడాది జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే రాష్ట్రంలోనే జిల్లాకు మొదటి స్థానం వచ్చింది. -లలితకుమారి, మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి, వికారాబాద్