మంచాల, సెప్టెంబర్ 15 : మంచాల మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ లోయపల్లి గ్రామం అభివృద్ధితో పాటు పచ్చదనానికి కేరాఫ్‌గా నిలిచింది. హరితహారంలో భాగంగా గ్రామంలో రోడ్లకు ఇరువైపులా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించడంతో ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామంలో ప్రకృతి వనం, వైకుంఠధామంలో నాటిన ప్రతి మొక్కకూ పంచాయతీ సిబ్బంది నీరు పడుతున్నారు. ప్రతినెల గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించడంతో లోయపల్లి రూపురేఖలు మారాయి. అంతేకాకుండా స్వచ్ఛతకు మారు పేరుగా నిలిచింది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2కోట్ల నిధులతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామంలో సీసీరోడ్లు, భూగర్భడ్రైనేజీలు, వైకుంఠధామం, వర్మీ కంపోస్టుయార్డు, పల్లెప్రకృతి వనంతో పాటు వార్డుల్లో పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించడం, హరిత హరంలో నాటిన మొక్కలకు నీరు అందించడంలాంటి పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. గ్రామంలో ఏ వీధి చూసినా సీసీరోడ్లతో పాటు వీధి దీపాలు కనిపిస్తాయి.
రోడ్లకు ఇరువైపులా..
హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని నాటిన ప్రతి మొక్కనూ సంరక్షిస్తున్నారు. దీంతో గ్రామంలో ఎక్కడ చూసినా పచ్చదనం వెల్లివిరుస్తున్నది. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో వివిధ రకాల పండ్లు, పూలు, నీడనిచ్చే చెట్లను పెంచడంతో అవి చిన్నపాటి వనంలా మారింది. గ్రామంలో రోడ్లకు ఇరువైపులా, వైకుంఠధామానికి వెళ్లే రహదారి వెంట, పల్లెప్రకృతి వనంలో మొక్కలను పెంచడంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రతి ఒక్కరికీ తమ ఇంటి వద్ద మొక్కలను పెంచుకోవాలనే సంకల్పంతో ఉన్నారు.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
లోయపల్లిని ఆదర్శ గామంగా తీర్చిదిద్దడం కోసం పాలక వర్గం సమిష్టిగా పనిచేస్తున్నాం. ప్రతి రోజూ స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నాం. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. ప్రతి కాలనీలో సీసీరోడ్లు, డ్రైనేజీ వేయించాం. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం, గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల పాత్ర మరువలేనిది.
– అనిత , సర్పంచ్ ఎల్లంకి
సమస్యలను పరిష్కరిస్తున్నాం..
లోయపల్లి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వం ఇస్తున్న నిధులతో ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నా. ప్రతి రోజూ పంచాయతీ సిబ్బందితో రోడ్లు శుభ్రం చేయించడం, మొక్కలకు నీటిని అందించడంతో పాటు ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాం. గ్రామంలో మొక్కల పెంపకంపై దృష్టి పెట్టడంతో అవి ఏపుగా పెరిగి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి.
– శోభ, పంచాయతీ కార్యదర్శి
మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాం
విద్యార్థినులు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించేలా ప్రోత్సహిస్తున్నాం. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి, చదువుల్లో విద్యార్థినులు మంచి ప్రతిభను చూపుతున్నారు. లక్ష్యాలను ఎంచుకున్న విద్యార్థులకు ఆ దిశగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. పాఠశాలకు మంచి గుర్తింపు వచ్చేలా నిరంతరం కృషి చేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడంతో ఎంతో మంది విద్యార్థినులు చదువుకునేందుకు వస్తున్నారు. ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది మంచి ఉన్నత స్థాయికి ఎదిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది.
– రమణమ్మ, ప్రిన్సిపాల్, కస్తూర్భా బాలికల పాఠశాల, వికారాబాద్