షాద్‌నగర్, సెప్టెంబర్ 14 : తెలంగాణ రాష్ట్రంలో రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ తన పాలనను కొనసాగిస్తున్నారని, దేశ రైతాంగానికే టీఆర్ఎస్ పాలన ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం షాద్‌నగర్ మార్కెట్ యార్డు ఆవరణలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మన్నె కవిత ఆధ్వర్యంలో రూ. 5.6 కోట్ల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న షెడ్ల నిర్మాణ పనులను ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులకు ఏ కష్టం రానివ్వకుండా సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రూ. 5.6 కోట్లతో నిర్మించే కవర్ షెడ్లో 40 షాపుల నిర్మాణాలు ఉంటాయని, రైతులు, వ్యాపారులకు మరిన్ని వసతులు కల్పిస్తామన్నారు. రూ. 1.8 కోట్ల నిధులతో నిర్మించిన కూరగాయల షెడ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బకన్నయాదవ్, కౌన్సిలర్ ఈశ్వర్‌రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జంగారి నర్సింహ, బా లు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్, నాయకులు నారాయణ, కమిషన్ ఏజెంట్లు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలపై..
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ప్రజాప్రతినిధులకు, అధికారులకు పిలుపునిచ్చారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో వజ్రోత్సవాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా జాతీయ సమైక్యత ఉత్సవాలను నిర్వహించాలని, ప్రజలను పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం చేయాలని కోరారు. మూడు రోజుల పాటు వజ్రోత్సవ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీలు వెంకట్రాంరెడ్డి, తాండ్ర విశాల, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, ఆర్డీవో రాజేశ్వరి, ఎంపీడీవో వినయ్‌కుమార్, తహసీల్దార్ గోపాల్, పలు శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బూర్గుల రామకృష్ణారావుకు ఘన నివాళి
హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
షాద్‌నగర్‌టౌన్ : సీఎం సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ న్యూసిటీకాలనీ చెందిన రవీందర్‌కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 60 వేల చెక్కును అందజేశారు.