సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): మిలిటరీ క్యాంప్‌లో మెడికల్ క్యాంప్ పెట్టాలి.. ఎంత ఖర్చవుతుందంటూ ఓ వైద్యుడికి ఫోన్ చేసిన సైబర్‌నేరగాడు, అతడి నుంచి రూ.6 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళితే.. మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన ఓ వైద్యుడికి తాను మిలిటరీలో పనిచేస్తున్నానంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మా వద్ద 300 మంది వరకు ఉంటారని వారికోసం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని కోరాడు. అయితే దానికి అయ్యే ఖర్చును మేం భరిస్తామని, మీరు డెబిట్ కార్డు నంబర్ చెబితే అడ్వాన్స్ డబ్బులు చెల్లిస్తానంటూ నమ్మించాడు. దీంతో వైద్యుడు వివరాలు చెప్పడంతో ఆ సైబర్ నేరగాడు పలు దఫాలుగా అతడి ఖాతా నుంచి రూ.6 లక్షలు ఖాళీ చేశాడు.
మిలిటరీలో యోగా శిక్షణ ఇవ్వాలి. నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలని అనుకుంటున్నాం. అందుకు మా క్యాంప్‌లో 500 మంది మిలిటరీ సిబ్బంది ఉంటారు. వాళ్లకు ఉదయం ఒక గంట పా టు యోగా, ధ్యానంలో శిక్షణ ఇవ్వాలి. ఒక్కొక్కరికీ రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తామంటూ సైబర్ నేరగాళ్లు నమ్మించారు. ఆ యోగా టీచర్ నెలలో రూ.5 లక్షలు వస్తాయని ఆశతో ఒప్పేసుకున్నాడు. మీ గూగుల్ పే నంబర్ చెప్పండి అంటూ నంబర్ తీసుకున్నారు. మీరు ఒక రూపాయి పంపించండి.. మీ నంబర్ నిర్ధారించుకుంటామంటూ సూచించారు. ఆ తర్వాత రెం డు రూపాయలు పంపించారు. మీరు మరోసారి రూ. వెయ్యి పంపిస్తే.. డబుల్ వస్తాయంటూ నమ్మించాడు. అలాగే చేయడంతో క్యూఆర్ కోడ్ పంపించారు. అం దులో రిసీవ్కు బదులుగా, పే అంటూ ఉంది. దీంతో బాధితుడు వెయ్యి పంపించడంతో వెంటనే రూ.2 వేలు రిటర్న్ వచ్చినట్లు కోడ్ వచ్చింది. బాధితుడు చూసుకోకుండా యాక్సెప్ట్ చేశాడు. వెంటనే ఖాతాలో నుంచి రూ.2 వేలు వెళ్లాయి. ఇలా తికమక పెడుతూ రూ.1.5 లక్షలు సైబర్‌నేరగాళ్లు కొట్టేశారు.
అవకాశం చిక్కితే..
మిలిటరీలో మెడికల్ క్యాంప్ పెట్టాలి… మిలిటరీ వాళ్లకు యోగా శిక్షణ ఇవ్వాలి.. మా సంస్థలో ఉన్న ఉద్యోగులకు ఫిజికల్ ఫిట్నెట్లో శిక్షణ ఇవ్వాలి ఇలా శిక్షకులను, వివిధ సేవలందించే వారిని టార్గెట్ చేస్తూ సైబర్‌నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ట్రై కమిషనరేట్ల పరిధిలో తరుచుగా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.