కులకచర్ల, జూలై 4 : నేరాలను అరికట్టేందుకు ప్రతి పల్లెలో సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం నుంచి కాని, అధికారుల నుంచి కాని ఆర్థిక సాయం లేకుండా గ్రామస్తులు, దాతలు ముందుకొచ్చి సీసీ కెమెరాల కొనుగోలుకు విరాళాలు ఇవ్వాలని కులకచర్ల ఎస్ఐ గిరి ఆయా గ్రామాల సర్పంచులు, పెద్దలు, యువతకు అవగాహన కల్పిస్తున్నారు. కులకచర్ల మండలంలోని 8 గ్రామాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
సమస్యాత్మక గ్రామాలను గుర్తించి దాతల సహకారంతో సీసీ కెమెరలకు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు పోలీసులకు సూచించారు. అధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ గిరి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మండలంలోని కులకచర్లతో పాటు కామునిపల్లి, ముజాహిద్పూర్ కటింగ్, ముజాహిద్పూర్, పుట్టపహాడ్, చౌడాపూర్, అంతారం, బండవెల్కిచర్ల, తిర్మలాపూర్, కుస్మసముద్రం, మక్తవెంకటాపూర్ గ్రామాల్లో కెమెరాలను బిగించారు. దాతల సాయంతో కులకచర్ల మండల కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
చోరీలు, ఇతర ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే సీసీ కెమెరాలతో గుర్తించే అవకాశం ఉంటుంది. ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని భావిస్తున్నారు. కులకచర్ల మండల కేంద్రం పెద్ద గేటు చౌరస్తాలో 4 సీసీ కెమెరాలు, బస్‌స్టాండు దగ్గర 3, చిన్నగేటు దగ్గర 3, పోలిస్ స్టేషన్ దగ్గర 3 సీసీ కెమెరాలను బిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సమస్యాత్మక గ్రామాల్లో..
సమస్యాత్మక గ్రామాల్లో ముందుగా సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. కులకచర్ల మండల కేంద్రంలో రద్దీగా ఉండే స్థలాల్లో కెమెరాలను బిగించాం. దాతల సహకారంతో ప్రతి గ్రామంలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఊరూరా అవగాహన కల్పిస్తున్నాం. నేరరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి.
– గిరి ఎస్ఐ, కులకచర్ల పోలిస్‌స్టేషన్
సహకారం అందిస్తున్నా..
కులకచర్ల గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటుకు పోలీసులకు సహకరిస్తున్నా. రద్దీగా ఉండే చౌరస్తాలో ఏర్పాటు చేయిస్తున్నాం. సీసీ కెమెరాలతో గ్రామస్తులకు రక్షణగా ఉంటుంది.
– సౌమ్యావెంకట్‌రాంరెడ్డి, కులకచర్ల సర్పంచ్
కామునిపల్లిలో ఏర్పాటు చేశాం..
కామునిపల్లి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాం. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వెంటనే తెలుస్తుంది. నేరాలు, చోరీలను అదుపు చేయవచ్చు.
– పాల మహిపాల్‌రెడ్డి, సర్పంచ్ కామునిపల్లి