కొత్తూరు, జూన్ 16 : ఊరంతా ఎటు చూసినా పచ్చదనం, శుభ్రమైన రోడ్లు, ప్రతి వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్టు యార్డు, చెత్త సేకరణకు ట్రాక్టర్, మొక్కలకు నీటిని సరఫరా చేసేందుకు ట్యాంకర్. గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంతో కొత్తూరు మండలంలోని పెంజర్ల.. అభివృద్ధిలో ముందంజలో ఉంది. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే ఆదర్శ గ్రామంగా నిలిచింది.
మూడేండ్లలో రూ. 1.7 కోట్లతో అభివృద్ధి
పెంజర్ల గ్రామంలో 700 గడపలో 6వేల వరకు జనాభా ఉంటుంది. గ్రామంలోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతున్నది. అందు కోసం రూ. లక్ష లీటర్ల సామర్థ్యం గల ఒక వాటర్ ట్యాంకు, 40 వేల లీటర్లతో మరో వాటర్ ట్యాంక్ నిర్మించారు. రూ. 29 లక్షలతో మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాల భవనం నిర్మిస్తున్నారు. పెంజర్లలో మూడేండ్లలో రూ. 1.7కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టారు. వీటిలో రూ. 40 లక్షలతో ప్రతి వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేశారు. మెయిన్ రోడ్డు నుంచి గ్రామంలోకి ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి సీసీ రోడ్డును నిర్మించారు. ప్రతి రోజూ చెత్తను సేకరించడానికి గ్రామ పంచాయతీ నిధుల నుంచి ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. చెత్తను డంప్ చేయడానికి కంపోస్ట్ యార్డు నిర్మించారు. అన్ని వీధుల్లో విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు.
పచ్చదనానికి ప్రాధాన్యం..
పెంజర్లలో పచ్చదనం పెంపునకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి అందులో 4 వేల మొక్కలను నాటి పెంచుతున్నారు. అంతే కాకుండా అవెన్యూ ప్లాంటేషన్ కింద రోడ్లకు ఇరువైపులా 3 వేల వరకు మొక్కలు నాటారు. దీంతో వాహనదారులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నాయి. అంతర్గత రోడ్ల వెంట 2 వందల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు.
సొంత నిధులతో గ్రామాభివృద్ధి..
సర్పంచ్ మామడి వసుంధర మూడేండ్లుగా ప్రభుత్వ నిధులతో పాటు తన సొంత నిధులు కూడా వెచ్చించి గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారు. రూ.7 లక్షల సొంత నిధులతో గ్రామంలో 100 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. రూ. 5 లక్షలతో వైకుంఠధామం వరకు సీసీ రోడ్డును నిర్మించారు. గ్రామంలోని జడ్పీహెచ్ఎస్కు డిజిటల్ టీవీని బహుమతిగా ఇచ్చారు. బతుకమ్మ ఘాట్, బీరప్పగుడి, మల్లన్న గుడి, అనంతపద్మనాభస్వామి పాత, కొత్త గుడుల అభివృద్ధికి తోడ్పాటును అందించారు.
గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం
గ్రామాన్ని ప్రభుత్వ, సొంత నిధులతో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నా. గ్రామంలోని అన్ని కుటుంబాలకు ప్రతిరోజూ తాగునీటిని అందిస్తున్నా. రోడ్ల శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా.
– మామిడి వసుంధర, సర్పంచ్, పెంజర్ల