ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 15 : క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసమే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా క్రీడా ప్రాంగణాలను ప్రారంభిస్తున్నదని టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం దండుమైలారం గ్రామంలో క్రీడాకారుల సౌకర్యార్థం ఆయన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పనులను పరిశీలించడంతోపాటు బడిబాటలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమం ద్వారా పెద్దఎత్తున పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయన్నారు. అనంతరం క్రీడా ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్రీడలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, సహకార సంఘం చైర్మన్ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ మల్లీశ్వరి, ఎంపీటీసీలు అనసూయ, అరుణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.