షాద్‌నగర్‌టౌన్, మే 20 : నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని విత్తన విక్రయ దుకాణాల నిర్వాహకులకు మండల వ్యవసాయాధికారి నిశాంత్‌కుమార్, పట్టణ సీఐ నవీన్‌కుమార్ సూచించారు. పట్టణంలోని సీడ్స్ దుకాణం, రైతన్న సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను శుక్రవారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని సూచించారు. రైతులు నష్టపోయే విధంగా నకిలీ విత్తనాలను విక్రయిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులకు విత్తనాలను విక్రయించినప్పుడు తప్పకుండా రసీదు ఇవ్వడంతో పాటు రికార్డులో నమోదు చేసుకోవాలన్నారు. వారి వెంట ఎస్ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు
కొందుర్గు, మే 20 : కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలంలోని ఫర్టిలైజర్ షాపుల్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి మధుసూదన్ అన్నారు. శక్రవారం కొందుర్గు మండల కేంద్రం, రామచంద్రపూర్ గ్రామాల్లోని ఫర్టిలైజర్ షాపులను ఎస్ఐ వెంకటేశ్వర్లతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు.
కొత్తూరు మండలంలో..
కొత్తూరు, మే 20 : నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మండల టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు హెచ్చరించారు. కొత్తూరు మండల టాస్క్‌ఫోర్స్ ఆధ్యర్యంలో కొత్తూరులోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వానకాలం సీజన్ వస్తున్నందున రైతులకు ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాలని చూచించారు. నకిలీ విత్తనాలు అమ్మితే షాపు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని వ్యాపారులను హెచ్చరించారు. ఈ తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యుడు కొత్తూరు సీఐ బాల్‌రాజు, వ్యవసాయ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
రైతులకు విక్రయ రసీదును ఇవ్వాలి
కడ్తాల్, మే 20: నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హరిశంకర్‌గౌడ్ హెచ్చరించారు. పోలీసు శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం మండల కేంద్రంలో పలు ఫర్టిలైజర్ దుకాణాలను పోలీసు సిబ్బందితో కలిసి ఆయన తనిఖీ చేశారు. విత్తనాలు, స్టాక్ బోర్డులు, లైసెన్స్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ డీలర్లు గడువు దాటిన విత్తనాలను విక్రయించవద్దని తెలిపారు. రైతులకు సంతకంతో కూడిన రసీదును ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ సీతారాంరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.