
రంగారెడ్డి, ఆగస్టు 15, (నమస్తే తెలంగాణ): జిల్లాలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. జిల్లావ్యాప్తంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి జాతీ య జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయన్నారు. పేద ప్రజల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు సత్ఫలితానిస్తున్నాయన్నారు. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికీ మంచినీటి సరఫరా పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. కరోనా నియంత్రించడం లో ప్రజలందరి భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. అనంత రం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సం క్షేమ పథకాలకు సంబంధించి శకటాలను ప్రదర్శించారు. కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్, చికిత్సకు సంబంధించి రూపొందించిన శకటం అందరిని ఆకట్టుకుంది. జిల్లాలోని 2866 స్వయం సహాయక సంఘాలకు రూ. 111.35 కోట్లు రుణాల చెక్కును సభ్యులకు అందజేశారు.
ఆర్థికంగా బలోపేతం చేసేందుకే దళితబంధు
కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా తదితర ఎన్నో విప్లవాత్మక పథకాలతో పాటు దళితుల కోసం ప్రవేశపెట్టిన పథకం దళిత బంధు అని మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వారికి సమాజంలో గౌరవ స్థానం కల్పించాలన్న సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలో లేదని తెలిపారు. దళిత సాధికరత పేరుతో ప్రస్తుత బడ్జెట్లోనే ఈ దళిత బంధుకు నిధులు కేటాయించామన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని లక్షల మంది అర్హులైన అట్టడుగు ఎస్.సి. కులాల లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేసే మహత్తర పథకం ఈ దళిత బంధు కార్యక్రమమన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలైన 100 శాతం దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేయనున్నామన్నారు. ఏ విధమైన బ్యాంకు గ్యారంటీ లేకుండా ఆర్థిక సహాయం పొందే ఈ పథక లబ్ధిదారులు ఏదైనా దురదృష్ట ఘటనల వల్ల నష్టాలకు గురై ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పాలమూరు ఎత్తిపోతల పనులు ముమ్మరం
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలో 10.23లక్షల ఎకరాలకు సాగు నీరు, తాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కెనాల్ నెట్ వర్క్ 2వ దశ నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద రంగారెడ్డిజిల్లాలోని 20 మండలాలకు చెందిన 330 గ్రామాల్లో 3,59,047 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందనుందన్నారు. మరోవైపు తెలంగాణ గ్రామీణ జీవితానికి ఆయువుపట్టయిన చిన్న నీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకానికి రూపకల్పన చేసిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో నాలుగు విడతల్లో కలిపి 1,024 చెరువుల్లో రూ.120 కోట్లతో పనులు చేపట్టి పూర్తి చేశామన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం సుమారు రూ. 55కోట్లతో 22 చెక్‌డ్యామ్‌లను నిర్మించామన్నారు. రాష్ట్రంలో 129 అర్బన్ పార్కులను తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించామని, ఇప్పటివరకు 59 పార్కులు పూర్తి అయ్యాయన్నారు. అందులో 32 పార్కులు హెచ్ఎండీఏ పరిధిలో అభివృద్ధికి నోచుకోవడం సంతోషకరమని, దీనిలో భాగంగా జిల్లాలోని పెద్ద అంబర్పేట్ కలాన్ అర్బన్ ఫారెస్ట్ పార్కు ను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు.
నేటి నుంచి రూ.50 వేలలోపు రుణమాఫీ
జిల్లాలో ఇప్పటివరకు 10,940 మంది రైతులకు రూ. 25వేల లోపు తీసుకున్న రుణాలను రూ.16,72కోట్ల రుణమాఫీ చేశామని, నేటి నుంచి 24వేల 13మంది రైతులకు రూ. 50 వేల లోపు తీసుకున్న రుణాలను రూ.82.49కోట్లు రుణమాఫీ చేయను న్న ట్టు తెలిపారు. రైతుబంధు పథకంలో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో రూ. 1967.86 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారన్నారు. ఈ వానకాలంలో రైతుబంధు పథకం కింద 2లక్షల 82వేల 94 మంది రైతుల ఖాతాల్లో రూ. 343.42 కోట్లు జమ చేశామన్నారు. రైతుబీమా కింద 922 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున రూ.46.10 కోట్లను వారి నామినీ ఖాతాల్లో జమ చేశామన్నారు. జిల్లాలో 26 కొనుగోలు కేంద్రాల ద్వారా 76 వేల 310 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 15,176 మంది రైతుల నుండి కొనుగోలు చేసి రూ. 144.32కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి వెల్లడించారు.
2717 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి
జిల్లాలో ఆరు గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాల పరిధిలో 6,777 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయగా వీటిలో 2,717 ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యిందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 16,630 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేశా మని, ఇందుకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను త్వరలో చేపడతామన్నారు. పల్లెప్రగతిలో భాగంగా జిల్లాలోని 558 గ్రామ పంచాయతీలకు ప్రతి నెల సుమారు రూ. 9.8 కోట్లు నిధులు మంజూరు చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నట్లు తెలిపారు. పల్లెప్రగతి ద్వారా ఇప్పటివరకు రూ. 250 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, జిల్లాలో రూ.20లక్షల చొప్పున రూ.1.20 కోట్లతో ఆరు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించినట్లు చెప్పారు. 558 గ్రామ పంచాయతీలలో వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల నిర్మాణాలు పూర్తయ్యాయి. పట్టణ ప్రగతిలో భాగంగా జిల్లాలో 16 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వివిధ అభివృద్ధి పనులకు రూ.95 కోట్లను విడుదల చేశామని మంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు.
పరిశ్రమల స్థాపనకు భారీగా పెట్టుబడులు
ప్రముఖ బహుళ జాతి సంస్థలైన టాటా గ్రూప్, పి అండ్ జి, విప్రో, పోకర్ణ గ్రానెట్స్, ప్రీమియర్ ఎనర్జీస్, చిర్పాట్ సంస్థలు తమ పరిశ్రమలను రంగారెడ్డిజిల్లాలో ఏర్పాటు చేశాయన్నారు. మన జిల్లాలో ప్రముఖ బహుళ జాతి సంస్థ అయిన అమెజాన్ కందుకూరు మండలం మీర్ఖాన్పేట్, షాబాద్ మండలం చందనవెళ్లి, యాచారం మం డలం మేడిపల్లిలలో డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తుందన్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలో 19,333 ఎకరాలలో రూ. 64 వేల కోట్ల వ్యయం తో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ ద్వారా లక్షా డబ్బు మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. శంకర్పల్లి మం డలం కొండకల్ వద్ద రూ.800 కోట్ల వ్యయంతో మేధా ఆధ్వర్యంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఉందన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలో రూ.35 కోట్ల వ్య యంతో 40 ఎకరాల్లో, ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో 22 ఎకరాల్లో రూ.20 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కులు నెలకొల్పామన్నారు. పరిశ్రమల అభివృద్ధి కోసం ఇప్పటివరకు టి.ఎస్ ఐపాస్ కింద 19 వేల 28 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 892 పరిశ్రమల ద్వారా 2.92లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. మరో 11 భారీ పరిశ్రమలను రూ.3,971 కోట్ల పెట్టుబడి తో 7,460 మందికి ఉపాధి లక్ష్యంతో స్థాపించినట్టు తెలిపారు.
ధరణితో 22,350 మ్యుటేషన్లు పూర్తి
ధరణిలో భాగంగా ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలో 22,350 మ్యుటేషన్లు పూర్తి చేశారన్నారు. ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ఆన్లైన్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని, 2021-22 విద్యా సంవత్సరంలో 3వ తరగతి నుండి పీజీ వరకు టీ-శాట్ దూరదర్శన్ ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో మహేశ్వరం, వికారాబాద్, పరిగి, ఉప్పల్‌లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతీక్ జైన్, తిరుపతిరావు, ఇతర జిల్లా అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.