రంగారెడ్డి, మే 4, (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేస్తున్నారు. గతంలో కరెంట్, సాగునీటి కష్టాలతో వ్యవసాయం దండుగ అన్న రైతన్నలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వడంతో జిల్లాలో సాగు పెరిగింది. అయితే 2014కు ముందు వ్యవసాయానికి కేవలం 4 గంటలు మాత్రమే కరెంట్ సరఫరా అయ్యేది. ఉదయం రెండు గంటలు, రాత్రి రెండు గంటలపాటు మాత్రమే కరెంట్ సరఫరా చేసేవారు. అప్పట్లో చేసే అరకొర విద్యుత్తు సరఫరాలోనూ వేళాపాళా లేకపోవడంతో రైతులు రాత్రిళ్లు పొలాల వద్దే కరెంట్ కోసం పడిగాపులు కాయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొని ఉండేది. రాత్రి సమయాల్లో పంటలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతన్నలు కొంత మంది విద్యుత్తు షాక్‌కు గురై మృత్యువాత పడిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అంతేకాకుండా కేవలం 4 గంటల కరెంట్ సరఫరాతో పంట తడి ఆరే పరిస్థితి కూడా లేకపోవడంతో పంటలు ఎండి రైతులు పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోయి అప్పులపాలయ్యేవారు.
అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం 24 గంటలపాటు నాణ్యమైన నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. 24 గంటలపాటు విద్యుత్తు సరఫరాతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు జలాలను పెంచేలా మిషన్ కాకతీయ కార్యక్రమంతో చెరువుల పునరుద్ధరణ పనులను చేపట్టడం, సాగునీటి ప్రాజెక్టులు చేపట్టడంతో భూగర్భజలాలు పెంపొందడంతో జిల్లాలో పంటల సాగు పెరిగింది. అంతేకాకుండా 2014కు ముందు వ్యవసాయానికి నెలకు కేవలం 11 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగంకాగా, ప్రస్తుతం 56.91 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం అవుతున్నది. అంతేకాకుండా తెలంగాణ రాష్ర్టానికి ముందు కేవలం 33 వేల విద్యుత్తు కనెక్షన్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల సంఖ్య 1,98,743కు పెరగడం గమనార్హం.
పొరుగు రాష్ర్టాల్లో కరెంట్ కష్టాలు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తూ 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తూ దేశం మొత్తం తెలంగాణవైపు చూస్తుండగా పొరుగు రాష్ర్టాల్లో మాత్రం రైతులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయానికి కూడా కనీసం 6 గంటల కరెంట్ సరఫరా లేకపోవడంతో రైతులు తెలంగాణలో వచ్చి వ్యవసాయ కూలీలుగా బ్రతుకుతున్నారు. జిల్లాలో ప్రతీ ఏడాది పత్తి తీసేందుకు కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వేల కుటుంబాలు మూడు, నాలుగు నెలలు వలస వచ్చి బతుకుతున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన కొందరు రైతులు జిల్లాకు వలసొచ్చి పొలాన్ని కౌలు తీసుకొని మరీ వ్యవసాయం చేస్తున్నారు.
నిరంతర విద్యుత్తు సరఫరా
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యుత్తు కోతలకు ఫుల్స్టాప్ పడింది. గతంలో వ్యవసాయానికి, పరిశ్రమలకు నాలుగైదు గంటలపాటు మాత్రమే విద్యుత్తు సరఫరా ఉండడంతో రైతులతోపాటు పరిశ్రమల నిర్వాహకులు తీవ్ర నష్టపోయారు. కొందరు చిన్న, మధ్యతరహా పరిశ్రమల నిర్వాహకులు తమ పరిశ్రమలను మూసేసి, పవర్ హాలీడేస్ ప్రకటించిన దయనీయ పరిస్థితులుండేవి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి గత ఏడేండ్లలో విద్యుత్తు కోతలు అనేది లేకుండా 24 గంటలపాటు వ్యవసాయానికి, పరిశ్రమలకు, గృహ అవసరాలకు కరెంట్‌ను సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా గతంలో వేసవి వచ్చిందంటే షాపుల నిర్వాహకులు, నర్సింగ్ హోంల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. 2014కు ముందు కరెంట్ కోతలతో ఎండకాలంలో ఉక్కపోతను తట్టుకోలేక షాపుల యజమానులు మూసివేసేవారు. కేవలం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, రాత్రి కూడా మూడు గంటలు మాత్రమే కరెంట్ సరఫరా ఉండడంతో షాపులను మూసేసి తీవ్రంగా నష్టపోయారు. అదేవిధంగా గతంలో కరెంట్ కోతలతో నర్సింగ్ హోంలు సైతం మూతపడిన పరిస్థితి నెలకొని ఉండేది. అయితే ప్రస్తుతం మాత్రం 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదవుతున్నప్పటికీ అన్ని రకాల షాపులకు, నర్సింగ్‌హోంలకు 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేస్తుండడంతో సంబంధిత యజమానులు ఉదయం నుంచి రాత్రి వరకు ఉక్కపోత లేకుండా ఏసీలు, ఫ్యాన్ల వాడకంతో తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు.
కరెంటు ఫుల్..
జిల్లాలో కరెంట్ ఫుల్‌గా ఉంటుంది. వేసవిలో మిగతా రాష్టాల్లో కరెంటు కోతలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే, ఇక్కడ సంతోషంగా సాగు పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం కరెంటు కోత అంటేనే మర్చిపోయామ్.
– వెంకటయ్య రైతుబంధు సమితి అధ్యక్షుడు, రుద్రారం, ధారూరు
కరెంట్ కష్టాలు తొలిగాయి..
సీఎం కేసీఆర్ వల్ల కరెంట్ కష్టాలు తొలిగాయి. 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. పగడి పూట ఆడోళ్లం పొలాలకు నీళ్లు పారిస్తున్నాం. మగొళ్లు ఇతర పనులకు పోతున్నారు. రెండు పంటలు సాగు చేస్తూ సంతోషంగా ఉన్నాం.
– సక్రిబాయి, మహిళా రైతు, వాల్యానాయక్ తండా
చేతి నిండా పని..
గతంలో విద్యుత్ సమస్యలు ఉండడంతో మోటరు వైండింగ్ పనులు చేయాలంటే ఇబ్బందిగా ఉండేది. షాపుల కిరాయి ఎల్లెవి కావు. ఇప్పుడు నిరంతరం కరెంటు ఉండడం వల్ల చేతి నిండా పని ఉంటుంది. షాపుల కిరాయిలతో పాటు కుటుంబం కూడా గడుస్తున్నది.
– ఎండీ ఖాజా, రాంపూర్ గ్రామం
కరెంట్ ఉన్నందునే స్టూడియో నడుస్తుంది..
ఉదయం నుంచి సాయంత్రం వరకు కరెంట్ ఉండడంతో ఫొటో స్టూడియో బాగా నడుస్తున్నది. గతంలో కరెంట్ సరిగ్గా లేక పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవు. వ్యాపారం కూడా బాగానే నడుస్తున్నది.
– రాములు, ఫొటో స్టూడియో షాబాద్