శంకర్పల్లి, మే 4 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాలనలో నేడు రాష్ట్రంలోని పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం శంకర్పల్లి మండలంలోని ఎల్వెర్తి, మహాలింగపురం, గాజులగూడ గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు, రైతు వేదికలు, సీసీ రోడ్లు, గ్రామ సంతలను చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాలింగపురంలో జరిగిన సభలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు అందరికీ కనిపిస్తున్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం రావాలనే తపనతో నాడు ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించారని కొనియాడారు.
సీఎం కేసీఆర్ రైతు కుటుంబం నుంచి వచ్చారని, అందుకే రైతు సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేస్తున్నారని తెలిపారు. నాడు రాష్ట్రం వస్తే చీకటి అన్న చోటనే నేడు వెలుగులు చిమ్ముతున్నాయని చెప్పారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా అవుతుంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశంలోని ఇతర రాష్ర్టాలు కరెంటు కోతలతో సతమతమవుతున్నాయన్నారు. నీటి సమస్యలు తీర్చిన గొప్ప పథకం మిషన్ భగీరథ అని కొనియాడారు. నేడు మండువేసవిలోనూ ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. నాడు తూర్పు గోదావరి జిల్లాకు వెళితే కాలువల ద్వారా నీటితో పంట పొలాల కనిపించేవని, అలాంటిదీ సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలోని 7 ఉమ్మడి జిల్లాలు సస్యశ్యామలం అయ్యాయని తెలిపారు. పాలమూరు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సాగు నీరు అందించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
మిషన్ కాకతీయతో నేడు రాష్ట్రంలోని చెరువులకు జలకళ వచ్చిందన్నారు. దేశంలో ఎవరూ ఇవ్వని విధంగా రాష్ట్రం లో దళితబంధు పథకం ద్వారా పేద దళితులందరికీ రూ.10 లక్షలు విడుతల వారీగా అందజేస్తామన్నారు. మంత్రి కేటీఆర్ రాష్ర్టానికి ప్రైవేటు కంపెనీలు వచ్చేలా నిరంతరం శ్రమిస్తూ, ప్రైవేటు సెక్టారులో ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నారని తెలిపారు. మరో వైపు సీఎం కేసీఆర్ ఇప్పటికే లక్షా 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి, ఒకేసారి గతంలో ఎన్నడూలేని విధంగా 81వేల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారని చెప్పారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, ఉన్న ఉద్యోగాలను పెద్దఎత్తున తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి పేద, మధ్య తరగతి అభ్యర్థులు డబ్బు వృథా చేసుకోకుండా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారన్నారు. కాగా, 57ఏండ్లు పైబడిన వారికి త్వరోనే పింఛన్లు మంజూరు చేస్తామన్నారు.
అలాగే సొంత ఇంటి స్థలం ఉన్న వారికి రూ.3 లక్షలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ చేకుర్త గోవిందమ్మ, సర్పంచులు సత్యనారాయణ, మాణిక్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ యాదగిరి, వెంకట్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు గోపాల్, వీ.వాసుదేవ్‌కన్నా, ఉపాధ్యక్షుడు రాఘవరెడ్డి, యువజన అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, నాయకులు చేకుర్త గోపాల్‌రెడ్డి, సాత ప్రవీణ్‌కుమార్, సంజీవరెడ్డి, ఎండీ గౌస్‌ఖాన్, కౌన్సిలర్ శ్రీనాథ్‌గౌడ్, ఆయా గ్రామాల వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాలింగపురం గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లి మంత్రి ప్రతేక పూజలు చేశారు.