మొయినాబాద్, మే 3 : పల్లెల్లో పలు చోట్ల ఉప ఎన్నికలు జరుగనుండటంతో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. వివిధ కారణాలతో మండలంలో ఒక సర్పంచ్, రెం డు ఎంపీటీసీ , 51 వార్డు స్థానాలు ఖాళీ అయ్యాయి. మే రెండో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రావచ్చనే ఆలోచనతో ఉప పోరుకు పంచాయతీ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. పోలింగ్ స్టేషన్ల వారీగా డ్రాఫ్ట్, ఫైనల్ పబ్లికేషన్ ప్రకటించారు. ఖాళీ అయిన స్థానాల్లో సదరు ప్రజాప్రతినిధి భార్య లేదా ఇతర కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు గ్రామాల పెద్దలు మంతనాలు చేస్తుండగా, ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుతో పదవిని చేజిక్కించుకునేందుకు మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.
మండలంలో 28 గ్రామ పంచాయతీలు ఉండగా ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన కొద్ది నెలలకు వ్యక్తి గత కారణాలు చూపి తమ పదవులకు రాజీనామా చేయడం, ఎన్నికైన వారు అకాల మరణం పొందడం, సకాలంలో ఎన్నికల వ్యయం చూపించకపోవడం వంటి కారణాలతో మొయినాబాద్ మండలంలో ఒక సర్పంచ్, రెండు ఎంపీటీసీ స్థానాలు, 51వార్డుల సభ్యుల స్థానాలు ఖాళీ అయ్యాయి. నాగిరెడ్డిగూడ సర్పంచ్ స్థానం ఎస్సీ రిజ ర్వు కావడంతో ఎన్నికలు జరగగా.. సర్పంచ్‌గా గెలుపొందిన వ్యక్తి ఏడాదిన్నరకే అకాల మరణం పొం దారు. దీంతో ఉపసర్పంచ్‌గా ఉన్న వ్యక్తి(బీసీ)కి ఇన్చార్జి సర్పంచ్ బాధ్యతలు అప్పగించి ఏడాదిన్నర పూర్తి చేసుకుంది.
ఎస్సీ వర్గం అనుభవించాల్సిన సర్పంచ్ పదవి స్థానంలో బీసీ వర్గం వ్యక్తి సర్పంచ్ బాధ్యతలు నిర్వహించడంతో ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తాయనే ఆశతో ఎస్సీ వర్గం వారు ఎదురు చూస్తున్నారు. తోలుకట్టా, చిలుకూరు-1 స్థానాల్లో గెలుపొందిన ఎంపీటీసీలు ఎన్నికల ఖర్చులు సకాలంలో ఎన్నికల అధికారులకు చూపని కారణంగా వారిపై అనర్హత వేటు పడింది. అదే విధంగా మండలంలో 28 గ్రామ పంచాయతీలు ఉండగా 18 గ్రామ పంచాయతీల్లో 51 మంది వార్డు స్థానాలు ఖాళీ అయ్యాయి.
ఉప ఎన్నికలు జరిగే స్థానాలు ఇవే…
మొయినాబాద్ మండలంలో 28 గ్రామ పంచాయతీలు ఉండగా,17 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. నాగిరెడ్డిగూడ సర్పంచ్ అకాల మరణంతో సర్పంచ్ స్థానం ఖాళీ అయ్యిం ది. చిలుకూరు-1, తోలుకట్టా స్థానాల ఎంపీటీసీలు ఎన్నికల ఖర్చులు ఎన్నికల అధికారులకు సకాలంలో చూపించకపోవడంతో వారిపై అనర్హత వేటు పడింది. 18 గ్రామ పంచాయతీల్లో 51 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు అన్ని సిద్ధం చేశారు. అమ్డాపూరులో ఒక స్థానం, అప్పారెడ్డిగూడలో 3, చందానగర్‌లో 2, కనకమామిడిలో 8 , ఖాళీంబౌలిలో ఒక స్థానం, కేతిరెడ్డిపల్లిలో ఒక స్థానం, మేడిపల్లిలో 4, మొయినాబాద్‌లో 3, మోత్కుపల్లిలో 3, ముర్తూజాగూడలో 2 పెద్దమంగళారంలో 2, కుతుబుద్దీన్గూడలో 5, రెడ్డిపల్లిలో 2, శ్రీరాంనగర్‌లో 2, వెంకటాపూర్‌లో 5, ఎల్కగూడలో ఒక స్థానం ఎనికేపల్లిలో ఒకటి, ఎతుబార్పల్లిలో 5 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
పోలింగ్ కేంద్రాలను సందర్శన
ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి అధికారులు క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ కేంద్రాలను పరిశీలిస్తున్నారు.