సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ముం దుకు సాగుతున్నది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డును దాటి శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో మెరుగైన మౌలి క వసతుల కల్పనపై దృష్టి సారించింది.కొత్తగా రోడ్ల నిర్మాణంతోపాటు అవసరమైన చోట ఫ్లై ఓవర్ల నిర్మాణం, పచ్చదనం పెంపునకు అటవీ ప్రాంతాలను అర్బన్ ఫారెస్టు బ్లాకులుగా అభివృ ద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్న ది. రియల్ ఎస్టేట్ సంస్థలు గతంలో చేపట్టిన లేఅవుట్లలో పది శాతం పార్కుల కోసం కేటాయించిన స్థలాలను గుర్తించాలని హెచ్ఎండీఏ తాజాగా నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నది. హెచ్ఎండీఏ కమిషనర్గా, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శిగా ఒకే అధికారి ఉండటంతో ఈ కార్యక్రమాన్ని హెచ్ఎండీఏ ప్లా నింగ్ అండ్ ఇంజినీరింగ్, అర్బన్ ఫారెస్ట్రీ విభా గం అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
పార్కు స్థలాల పరిరక్షణ..
జీహెచ్ఎంసీ పరిధిని మినహాయిస్తే హెచ్ఎండీఏ పరిధిలో 40 వరకు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత గ్రేటర్ చుట్టూ ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లోని పాలనపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టిని సారించింది. అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఇంటి పన్నుల వసూ లు, శానిటేషన్, గ్రీనరీని పెంపొందించడం వంటి పలు పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నది. ఈ మున్సిపాలిటీల పరిధిలోనే పెద్ద మొత్తంలో లేఅవుట్లున్నాయి.
ఈ ప్రాంతాల్లోనే కొత్తగా నివాసాలు వెలుస్తున్న నేపథ్యంలో పాత లేఅవుట్లను గుర్తించి, అందులో పదిశాతం మేర పా ర్కుల కోసం కేటాయించిన స్థలాలను గుర్తించడంతోపాటు వాటి చుట్టూ కంచెను ఏర్పాటు చేయనున్నారు. జూన్లో చేపట్టనున్న హరితహారంలో అధిక సంఖ్యలో మొక్కలను నాటాలని హెచ్ఎండీఏ అధికారులు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 500 పార్కు స్థలాలను గుర్తించి, వాటి పరిరక్షణకు ప్రహరీలను నిర్మించనున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీల అధికారులతో కలిసి పార్కుల స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నారు.
హెచ్ఎండీఏ స్వరూపం..
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న హెచ్ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు. ఇందులో 7 జిల్లాలు, 70 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 40 మున్సిపాలిటీలు, నగర పంచాయతీ లు, 719 గ్రామాలు ఉన్నాయి. గ్రేటర్ చుట్టూ 30 కి.మీ నుంచి 50 కి.మీ వరకు హెచ్ఎండీఏ పరిధి విస్తరించి ఉంది. నగర శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హెచ్ఎండీఏ పరిధిలో వేల సంఖ్యలో కొత్తగా లేఅవుట్లు వెలుస్తున్నాయి. ఇప్పటికే ఏడు జిల్లాల పరిధిలో తుది లేఅవుట్ల అనుమతి పొందినవి 12,000లకు పైగా ఉన్నాయి. కొత్తగా మరిన్ని ఏర్పాటవుతూనే ఉన్నాయి. వాటికి తోడు ఔటర్ రింగు రోడ్డు బయట కొత్తగా పదుల సంఖ్యలో పారిశ్రామిక వాడలు వందల ఎకరాల్లో వెలుస్తున్నాయి. దీం తో హెచ్ఎండీఏ చుట్టూ ఉన్న 50 కి.మీ వరకు ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణను చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.