చేవెళ్ల రూరల్, మే 2: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, దీన్‌దయాళ్ గ్రామీణ కౌశల్ యోజన, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మాణ రంగానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులతో కూడిన ఉచిత శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా చేవెళ్లలో న్యాక్(నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్) నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన కేం ద్రాన్ని గత నెలలో ప్రారంభించింది.
శిక్షణకు అర్హతలు..సౌకర్యాలు..
శిక్షణ పొందేందుకు 18 నుంచి 35 ఏండ్ల లోపు వయస్సు ఉన్న వారు అర్హులు. శిక్షణ 90 రోజులు(3 నెలలు). 1) ల్యాండ్ సర్వేయర్(ఎల్ఎస్) శిక్షణకు అర్హతలు ఇంటర్/ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి. 2) ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్ (ఈహెచ్డబ్ల్యూ)కు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 3) ప్లంబింగ్ అండ్ శానిటేషన్ (పీ అండ్ ఎస్)కు 7వ తరగతి పాసై ఉండాలి.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలు అందజేయాలి.
ఉచితంగా యూనిఫాం.. ప్రాక్టికల్ సామగ్రి
అభ్యర్థులకు శిక్షణ సమయంలో ఉచితంగా యూనిఫాం, షూ, హెల్మెట్, స్టేషనరీ అందజేస్తారు. శిక్షణ అనంతరం న్యాక్(నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్) ధ్రువీకరణ పత్రా న్ని అందిస్తారు. ఈ సర్టిఫికెట్ గల్ఫ్వెళ్లే వారికి, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగానికి ప్లేస్‌మెంట్‌గా చూపబడుతుంది.
న్యాక్ గురించి..
న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్)కు చైర్మన్‌గా సీఎం కేసీఆర్, వైస్ చైర్మన్‌గా రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. న్యాక్ ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలను కల్పించడం.
ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
ఆర్ఆర్ (రంజిత్ రెడ్డి)ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేవెళ్లలోని న్యాక్‌లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన కోసం భవనాన్ని ఉచితంగా అందిం చారు. వసతి సౌకర్యం కల్పించారు.
అందుబాటులో స్పోర్ట్స్ కిట్స్..
శిక్షణ తరగతుల అనంతరం అభ్యర్థులు క్రీడలు ఆడుకునేలా ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన కేంద్రం ఆవరణ అనుకూలంగా ఉన్నది. దీంతో అక్కడ స్పోర్ట్స్ కిట్స్ వాలీబాల్, షటిల్, క్యారమ్స్, చెస్ బోర్డు తదితర సామగ్రిని అందుబాటులో ఉంచారు.
నిరుద్యోగులు ఉపయోగించుకోవాలి
గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన కేంద్రంలోని సేవలను సద్వినియో గం చేసుకోవాలి. ఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున న్యాక్ బిల్డింగ్‌ను ఉచితంగా ఇచ్చాం. యువతకు ఉపాధి లభిస్తే నిరుద్యోగ సమస్య ఉండదు. పదోతరగతి, ఇంటర్ పాసై ఖాళీగా ఉండకుండా ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను సంప్రదించి శిక్షణ తీసుకోవాలి.
– డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు, ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్
ల్యాండ్ సర్వేపై ఆసక్తి
ల్యాండ్ సర్వేపై అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నా. విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకునేందుకు అధికంగా ఆసక్తిని చూపుతున్నారు. అన్ని రకాలుగా భూముల సర్వేలపై ప్రాక్టికల్ అనుభవం నేర్పుతున్నాం. మున్ముందు ఈ కోర్సుకు ఆదరణ పెరుగనున్నది.
– సాయికుమార్, ల్యాండ్ సర్వే శిక్షకుడు
శిక్షణతో ఉపాధి అవకాశాలు మెండు
న్యాక్ శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకున్న యువతకు నిర్మా ణ రంగంలో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సమయాన్ని, అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగితే విజయం సొంతమవుతుంది. వివిధ జిల్లాలకు చెందిన అనేక మంది నిరుద్యోగులు ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. వారికి శిక్షణ పూర్తైన తర్వాత ప్లేస్‌మెంట్‌ను కూడా కల్పించే అవకాశం ఉంటుంది.
– పి.ప్రసాద్, ఎలక్ట్రికల్, హౌజ్ వైరింగ్ శిక్షకుడు
వసతులు బాగున్నాయి..
ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నా. మొదటి నుంచి ఎలక్ట్రికల్ వర్క్‌పై ఆసక్తి ఉండేది. శిక్షణ పూర్తయిన వెంటనే ఉపాధి దిశగా ముందుకు సాగుతా. ఇక్కడ వసతులు చాలా బాగున్నాయి. శిక్షకులు తరగతులు అర్థమయ్యేలా బోధి స్తున్నారు.
– బాలకృష్ణ, వికారాబాద్
ల్యాండ్ సర్వేలో శిక్షణ తీసుకుంటున్నా..
ల్యాండ్ సర్వేలో శిక్షణ తీసుకుంటున్నా. ప్రస్తుతం భూముల విలువ పెరిగి క్రయవిక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. అందువల్ల ఈ కోర్సులో జాయిన్ అయ్యా. ఉపాధి అవకాశాలు కూడా అధికంగా ఉంటాయని భావిస్తున్నా.
– వి.శ్రీధర్, కొత్తపల్లి
ప్లంబింగ్కు మంచి డిమాండ్..
ప్రస్తుత భవన నిర్మాణ రంగంలో ప్లంబింగ్కు మంచి డిమాండ్ ఉన్నది. ఇందులో శిక్షణ తీసుకుంటే ఎక్కడైనా పని చేసుకోవచ్చు. ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నాయి. శిక్షణలో విద్యార్థులకు మెళకువలు నేర్పుతున్నా.
– ఎస్ఏ.ఖాదిర్, ప్లంబింగ్ శిక్షకుడు
అనుభవజ్ఞులైన బోధకులతో తరగతులు..
న్యాక్ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన కేంద్రంలోని శిక్షణ కోర్సులను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను పొందాలి. విద్యార్థులు ఏ జిల్లాలకు చెందిన వారైనా ఇక్కడకొచ్చి శిక్షణ తీసుకోవచ్చు. ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించి అనుభవజ్ఞులైన బోధకులతో తరగతులను నిర్వహిస్తున్నాం. ఇతర వివరాలకు 94404 10459, 94924 89330 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి.
– పి.నిజలింగప్ప, అసిస్టెంట్ డైరెక్టర్, న్యాక్, రంగారెడ్డి జిల్లా