మంచాల, ఏప్రిల్ 30: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తికావడంతో ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మంచాల మండలం లింగంపల్లి గేట్ సమీపంలోని సర్వే నంబర్ 100లో నాలుగు ఎకరాల ఇరవై గుంటల భూమిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాయి. మొదటి విడుతలో 100 ఇండ్ల నిర్మాణం పనులు పూర్తి కావడంతో ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇండ్లను అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మండలంలోని వివిద గ్రామాల్లో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లుకట్టివ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వ అధికారులు లింగంపల్లి గేట్ సమీపంలో డబుల్ బెడ్రూం ఇండ్లను మొదటి విడతగా 100మంది నిరుపేద లభ్ధిదారులకు జీప్లస్ 2పేరుతో ఇండ్ల నిర్మాణం పనులను పూర్తి చేశారు. ఇండ్లు లేని ప్రతి నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లకు స్వీకారం చుట్టడమే కాకుండా పనులు కూడా పూర్తి కావడంతో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఏడాది కాలంలోపే లింగంపల్లి గేట్ సమీపంలో ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయడంలో అధికారుల కృషి ఎంతగానో ఉంది. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో అధికారులు ఏమాత్రం రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలపై దృష్టి పెట్టి పూర్తి చేయించారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు. ఇండ్ల నిర్మాణం పనులు పూర్తి కావడంతో నిరుపేద కుటుంబాలకు చెందిన వారి సొంతింటి కల త్వరలో నెరవేరనుంది.
ఇండ్ల నిర్మాణం పూర్తి
ఇల్లులేని పేదలకు సొంతింటి కల సహకారం కానున్నది. లింగంపల్లి సమీపంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడంతో మండలంలో ఉన్న ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సొంతింటి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే డబుల్బెడ్రూం ఇండ్లను అర్హుల జాబితాలో ఎంపికైన పేదలకు అందజేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
అర్హులందరికీ ఇండ్లను అందజేస్తాం
మంచాల మండలంలో లింగంపల్లి గేటు సమీపంలో పూర్తిఅయిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులైన వారందరికీ అందజేస్తాం. మండలంలో ఇల్లులేని నిరుపేదల గుర్తించి పంపిణీ చేస్తాం. ముఖ్య మంత్రికేసీఆర్ కలలుకన్న డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి అయ్యాయి. త్వరలో మండలంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అందజేస్తాం.
– ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి