పరిగి, ఏప్రిల్ 30 : అన్నదాతలు బాగుపడాలన్నదే రాష్ట్ర సర్కార్ సదుద్దేశం. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నది. మామిడి రైతులకు లాభాలొచ్చేలా మార్కెట్ ధరకే కొనుగోలు చేసి, రైతు ఉత్పత్తి సంస్థ(ఎఫ్పీసీ)ల బ్రాండ్ నేమ్‌తో దేశ నలుమూలలకు ఎగుమతి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా పరిధిలోని కులకచర్లలోని రామలింగేశ్వర, మోమిన్‌పేట్‌లోని అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల సంస్థలతో పాటు బొంరాస్‌పేట్‌లోని రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో మామిడి పండ్లను సేకరించేందుకు రైతుల వారీగా వివరాలను అధికారులు సేకరించారు.
కొనుగోలు చేసిన మామిడి పండ్లను ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి విక్రయించేలా అక్కడి అధికారుల అనుమతి కోసం సెర్ప్, ఉద్యానవన శాఖ తరఫున లేఖ రాసినట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా వికారాబాద్ జిల్లా కేంద్రంలోనూ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కులకచర్ల మండలంలోని ఆయా గ్రామాల నుంచి సుమారు 106.3 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతాయని అధికారులు అంచనా వేశారు. కొనుగోలు చేసిన మామిడి పండ్లను హోల్‌సేల్, రిటైల్ ధరలకు విక్రయించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ బ్రాండ్‌నేమ్‌తో ఎగుమతులు చేయడం వల్ల భవిష్యత్తులో మరిన్ని ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా పరిధిలోని మామిడి రైతుల నుంచి రైతు ఉత్పత్తి సంస్థ (ఎఫ్పీసీ)ల ద్వారా మామిడిపండ్లను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఓవైపు రైతులకు అప్పటి మార్కెట్ ధర కల్పించడం ద్వారా రవాణా ఖర్చులు మిగలడంతోపాటు రైతు ఉత్పత్తి సంస్థలకు లాభాలు ఆర్జించి పెట్టే ఈ వ్యాపారం చేయించడం కోసం సెర్ప్, ఉద్యానవన శాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఈ మేరకు మామిడి విక్రయాలు చేపట్టే రైతుల వారీగా వివరాలు సేకరణ చేపట్టారు. జిల్లా పరిధిలోని కులకచర్ల శ్రీ రామలింగేశ్వర రైతు ఉత్పత్తిదారుల సంస్థ, మోమిన్‌పేట్‌లోని శ్రీ అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల సంస్థ, బొంరాస్‌పేట్‌లోని రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా మామిడి రైతుల నుంచి మామిడిపండ్లు కొనుగోలు చేసి ఎగుమతులు చేపట్టేందుకు ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా కులకచర్ల శ్రీ రామలింగేశ్వర రైతు ఉత్పత్తి సంస్థ ద్వారానే మామిడిపండ్ల సేకరణ జరుపనుండడంతో సంస్థ బ్రాండ్ పేరిట విక్రయాలు జరిపే ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు.
రైతుల వారీగా వివరాల సేకరణ..
మామిడి పండ్లను సేకరించి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేపట్టేందుకు మామిడి ఎంతమంది రైతులు ఉత్పత్తిదారుల సంస్థలకు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారనేది వివరాలు సేకరించారు. కులకచర్ల మండలంలోని లింగంపల్లి, కుస్మసంద్రం, సాల్వీడ్, చెల్లాపూర్, ఘనాపూర్, అంతారం, చౌడాపూర్, వీరాపూర్, ఇప్పాయిపల్లి, పీరంపల్లి గ్రామాలకు చెందిన 48 మంది రైతులు సాగు చేసి 96 ఎకరాల విస్తీర్ణంలోని మామిడితోటల ద్వారా మామిడిపండ్లు సేకరించేందుకు అధికారులు నిర్ణయించారు. కులకచర్ల మండలంలోని గ్రామాల నుంచి సుమారు 106.3 మెట్రిక్ టన్నులు మామిడిపండ్లు ఉత్పత్తి అవుతాయని అంచనా వేస్తున్నారు. వీటితోపాటు మోమిన్‌పేట రైతు ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా పది మంది, బొంరాస్‌పేట రైతు ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా మరో పది మంది నుంచి మామిడిపండ్లు సేకరించి ఎగుమతులు చేపట్టనున్నారు. ఇందులో ప్రధానంగా బేనిషాన్, బంగినపల్లి రకాల మామిడిపండ్లు ఉండడంతో వాటిని ఎగుమతికి నిర్ణయించారు. కొన్ని జ్యూస్ కంపెనీలకు ఈ మామిడిపండ్లు ఎగుమతి చేసి మామిడికాయలు కోతలు చేపట్టే రోజు హైదరాబాద్‌లోని పండ్ల మార్కెట్లో ఎంత ధర ఉన్నదో అదే ధర రైతులకు చెల్లించారు.
ఢిల్లీ తెలంగాణభవన్‌లో ప్రత్యేక స్టాల్..
వికారాబాద్ జిల్లాలోని మామిడి రైతుల నుంచి రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా సేకరించిన మామిడిపండ్లు ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో ప్రత్యేకంగా వికారాబాద్ జిల్లాకు చెందిన మామిడిపండ్ల విక్రయాలకు తెలంగాణభవన్ అధికారుల నుంచి అనుమతికి లేఖ రాసినట్లు సమాచారం. ఉద్యానవన శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో ఈ లేఖ రాసినట్లు తెలిసింది. తెలంగాణభవన్ అధికారుల నుంచి అనుమతి రాగానే స్టాల్ ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టాల్లో హోల్‌సేల్ ధరలతోపాటు రిటైల్ అమ్మకాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు జిల్లా కేంద్రమైన వికారాబాద్లోనూ ఎఫ్‌పీవోల ద్వారా ప్రత్యేకంగా మామిడిపండ్ల స్టాల్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉద్యానవన శాఖకు చెందిన మామిడితోటలు లీజుకు తీసుకోవడంతోపాటు జిల్లాలోని రైతుల నుంచి సేకరించిన మామిడిపండ్లు ఈ స్టాల్ ద్వారా విక్రయించాలని కసరత్తు చేస్తున్నారు.
ఎఫ్పీసీ బ్రాండ్‌నేమ్‌తో ఎగుమతులు..
రైతుల నుంచి సేకరించే మామిడిపండ్లు రైతు ఉత్పత్తిదారుల సంస్థ బ్రాండ్నేమ్పై విక్రయించాలని నిర్ణయించారు. 90శాతం పైగా కులకర్లలోని శ్రీ రామలింగేశ్వర రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో మామిడిపండ్ల సేకరణ జరుగనుండడంతో సంబంధిత ఎఫ్పీసీ పేరిట మామిడిపండ్ల ఎగుమతులు చేపట్టనున్నారు. ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసేందుకు 2 కిలోలు, 5 కిలోల మామిడిపండ్లు వచ్చేలా బాక్సులు తయారు చేయించడం జరుగుతున్నది. మే నెల మొదటి వారంలోనే మామిడిపండ్ల ఎగుమతులకు ఏర్పాట్లు చేస్తున్నారు. మే రెండో వారంలో పక్వానికి వచ్చిన పండ్లు మరింత రుచికరంగా ఉంటాయని, అందువల్ల అత్యధికంగా రెండో వారంలోనే ఎగుమతులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పండ్లతోట నుంచే మామిడిపండ్ల సేకరణ జరుపడంతో రైతుకు రవాణా, హమాలీ ఖర్చులు మిగులుతాయి. అలాగే మామిడిపండ్లు కోత రోజు మార్కెట్లో ఉండే ధర లభిస్తుంది. రైతు ఉత్పత్తిదారుల సంస్థకు ఆదాయం చేకూరుతున్నది.
గిట్టుబాటు ధర లభిస్తుంది..
కులకచర్లలోని శ్రీరామలింగేశ్వర సిరి ధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మామిడికాయలు కొనుగోలు చేస్తున్నారు. తమకున్న మామిడితోటలో ఉన్న మామిడి కాయలను ఎఫ్‌పీవోకు పంపిస్తున్నాం. దళారులు వచ్చి తక్కువకు తోటను తీసుకునేవారు. ప్రస్తుతం దళారుల నుంచి రక్షణ పొంది గిట్టుబాటు ధరను పొందుతున్నాం. మూడు సంవత్సరాలుగా తమ మామిడికాయలను ఎఫ్‌పీవోకు అందజేస్తున్నాం. మార్కెట్ విలువ ప్రకారం మాకు రేటును కట్టిస్తున్నారు.
– హునిబాయి, రాంనగర్, కులకచర్ల మండలం
మూడేండ్లుగా కొనుగోలు చేస్తున్నాం
మూడేండ్లుగా కులకచర్లలో శ్రీ రామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మామిడి కాయలను కొనుగోలు చేసి బెనియాన్ కంపెనీకి పంపిస్తున్నాం. రైతుల ద్వారా సేకరించిన మామిడికి మార్కెట్ రేటు ప్రకారం రైతులకు డబ్బులు చెల్లిస్తున్నాం.
– శ్రీదేవి, అధ్యక్షురాలు, శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం కులకచర్ల