రంగారెడ్డి, ఏప్రిల్ 25, (నమస్తే తెలంగాణ): ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కార్.. పోలీస్ శాఖలో 16,614 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరుద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రానుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. త్వరలోనే గ్రూప్-1 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు ఉద్యోగార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్లు కొనసాగుతుండగా అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏదేమైనా ఈసారి కొలువు కొట్టాలనే పట్టుదలతో నిరుద్యోగులు శ్రమిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పోలీస్ శాఖలో 16,614 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. పోలీస్ శాఖలో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జిల్లావ్యాప్తంగా నిరుద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ఇప్పటికే కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు, బదిలీల ప్రక్రియ పూర్తి కావడంతో ఖాళీలపై స్పష్టత వచ్చింది. దీంతో ప్రభుత్వం శాఖల వారీగా నోటిఫికేషన్లను జారీ చేసేందుకు సిద్ధమైంది. సోమవారం పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీకాగా, త్వరలోనే గ్రూప్-1 పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ రానున్నది. మరోవైపు ఉద్యోగార్థులు కోచిం గ్ సెంటర్లు, గ్రంథాలయాల్లో పుస్తకాలతో గంటల తరబడి కుస్తీ పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగా న్ని సాధించాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదేవిధంగా ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యం లో ఉచిత కోచింగ్ కేంద్రాలు ప్రారంభంకాగా, ప్రభు త్వం కూడా ఉచితంగా గ్రూప్స్‌లో కోచింగ్ ఇస్తున్నది.
ఉద్యోగార్థుల హర్షం
పరిగి, ఏప్రిల్ 25: చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 80 వేలపైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించగా…అందులో తొలి నోటిఫికేషన్ పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి సోమవా రం ప్రభుత్వం జారీ చేసింది. 16,614 పోలీసు ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ కావడంతో ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇం దులో 587 ఎస్ఐ పోస్టులు, 16,027 కానిస్టేబుల్ పోస్టులున్నాయి. వీటికి మే 2నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. వికారాబాద్ జిల్లాలోనూ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కానున్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్లను జారీ చేస్తామని ప్రకటించడం తో ఉద్యోగార్థులు శిక్షణ పొందుతున్నారు. జిల్లాలోని వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరు ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి ప్రత్యేకంగా ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖల ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల కోసం ఉచిత శిక్షణ శిబిరాలను కలెక్టర్ నిఖిల సోమవా రం వికారాబాద్‌లో ప్రారంభించారు. పోలీసు శాఖ ద్వా రా శిక్షణతోపాటు అవసరమైన మెటీరియల్‌ను కూడా ఉచితంగా అందజేస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉద్యోగార్థుల్లో ఆనందం వ్యక్తమవుతుంది.
ఎస్ఐ ఉద్యోగమే లక్ష్యంగా..
గతంలో సరైన అవగాహన లేకపోవడంతో పోలీస్ ఉద్యోగానికి సెలెక్ట్ కాలేకపోయా. ఈసారి కచ్చితంగా జాబ్‌ను సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా. ప్రభుత్వం పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్‌ను జారీ చేయడం ఆనందంగా ఉంది. ఎస్ఐ జాబ్ సాధించాలన్నదే నా లక్ష్యం.
– శ్రీకాంత్, కోస్గి, కొడంగల్ నియోజకవర్గం
ప్రైవేట్ జాబ్‌ను మానేసి..
పోలీస్ ఉద్యోగాన్ని సాధించేందుకు సిద్ధమవుతున్నా. అందుకోసం వికారాబాద్‌లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని కూడా సద్వినియో గం చేసుకుంటున్నా. అంతేకాకుండా వివిధ రకాల పుస్తకాలు, మెటీరియల్‌ను ప్రతిరోజూ చదువుతున్నా. చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగాన్ని కూడా మానేసి పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నా. -నవీన్, వికారాబాద్