షాద్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 24 : వారెవ్వా ఏమి రుచి హలీం తినరా మై మరచి అనువిధంగా హలీం సువాసనలు భోజన ప్రియులను ఆకర్షిస్తున్నాయి. రంజాన్ మాసం ప్రారంభమైందంటే చాలు అనునిత్యం హలీం తినేందుకు ఇష్టపడుతుంటారు. ప్రాచీన కాలం నుంచి హలీంకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. పౌష్టిక విలువలతో కూడిన హలీంను తింటే రుచితో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని యువత ఈ హలీంను తినేందుకే ఆసక్తి చూపుతారు. రంజాన్ మాసంలో హలీం తయారీదారులు అందరి అభిరుచులకు అనుగుణంగా హలీం తయారు చేసి విక్రయిస్తుంటారు. మున్సిపాలిటీలో హలీం విక్రయ కేంద్రాలు విరివిగా ఏర్పడ్డాయి.
హలీం తయారీ ఇలా..
ఘుమఘుమలాడే హలీంను ప్రత్యేక మాస్టర్లు తయారు చేస్తారు. ఇందుకు ప్రత్యేక శిక్షణను సైతం తీసుకుంటారు. సువాసనతో పాటు రుచిగా తయారు చేసేందుకు ప్రత్యేక మసాల దినుసులను వాడుతూ మరింత రుచిగా తయారు చేస్తున్నారు. హలీం తయారు చేయాలంటే ముందుగా చికెన్ లేదా మటన్‌ను శుభ్రంగా కడుగాలి. తర్వాత మాంసాన్ని, పచ్చి మిరపకాయలు, జీలకర్రతో నీళ్లలో ఉడికించాలి. ప్రధానంగా గోధుమరవ్వను వేసి గంట సమయం పాటు బాగా ఉడికించాల్సి ఉంటుంది. అనంతరం రుచి వచ్చే విధంగా సాజీర, దాల్చినచెక్క, యాలకుల ఫౌడర్, లవంగాలు, సొంటి, మిరియాల ఫౌడర్, మిరియాలు, జీలకర్ర, గులాబీ పూల రెక్కలు, తోక మిరియాలు, జాపత్రి ఫౌడర్, దొడ్డు ఉప్పు, నెయ్యి, డాల్డా, అల్లమెల్లిగడ్డతో బాగా గోటా చేయాలి. ఇలా సుమారు 2గంటల పాటు గోటా చేయాల్సి ఉంటుంది. తర్వాత సువాసన వచ్చే విధంగా కోతిమీర మీదుగా వేస్తే రుచికరమైన హలీం తయారవుతుంది.
రుచి బాగుంటుంది..
రంజాన్ మాసం వచ్చిదంటే చాలు అనునిత్యం హలీం తింటా. ఘుమ ఘుమలాడే హలీం ఎంతో రుచిగా ఉంటుంది. హలీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యంతో పాటు రుచిగా ఉండడంతో మా స్నేహితులతో కలిసి హలీం తింటా.
-రాజు, షాద్‌నగర్
హలీం పేరు వింటేనే నోరు ఊరుతుంది
పవిత్ర రంజాన్ మాసంలో సాయంత్ర సమయంలో హలీం పేరు వింటేనే నోరు ఊరుతుంది. ప్రాచీన కాలం నుంచి హలీంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కేవలం ఈ రంజాన్ మాసంలోనే హలీం ప్రత్యేక రుచి వస్తుంది. అనునిత్యం హలీం తినేందుకు ఇష్టపడుతా.
-భాను, షాద్‌నగర్