ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 19 : ఆర్టీసీలో సరుకులు, పార్సిల్ రవాణా కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్గో సర్వీస్‌పై ప్రజల్లో మంచి ఆదరణ పెరుగుతున్నది. ఇతర కొరియర్ సర్వీస్‌ల కంటే వేగంగా సేవలందుతుండటంతో కార్గో సర్వీస్‌ను బుక్‌చేసుకునే వారి సంఖ్య అధికమవుతున్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలిస్తుండటంతో పాటు ఆదాయం సమకూరుతున్నది. పార్సిల్ రవాణాలో భద్రత చర్యలు పాటిస్తుండటంతో పాటు ఇతర సర్వీసుల కంటే తక్కువ ధరకే సేవలందుతున్నాయి. కార్గో సేవలు ప్రవేశపెట్టిన మొదటి రోజుల్లో సరుకులు మాత్రమే రవాణా చేసేవారు.
ప్రస్తుతం రైతులకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు, సిమెంట్, బియ్యం బస్తాలు, పంటను మార్కెట్‌కు తరలించడంతో పాటు ముఖ్యంగా అంగన్వాడీలకు టీఎస్ఫుడ్, విజయ ఆయిల్, రోహిణి ఫీడ్స్ వంటి సరుకులు రవాణా చేస్తుండటంతో ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోకు ప్రతినెలా సుమారు రూ.3.50లక్షల వరకు ఆదాయం సమకూరుతున్నది. ఇబ్రహీంపట్నం డిపో పరిధిలో 7 కార్గో బస్సుల ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నది. ఇతర జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకూ అవసరమైన టీఎస్ఫుడ్ సరుకులు సరఫరా అవుతుండటంతో ఆదాయం మరింత పెరుగుతోందని ఇబ్రహీంపట్నం డీఎం అశోక్‌రాజు తెలిపారు.
రోజుకు సరాసరి 100 నుంచి 150బుకింగ్స్..
ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్టాండులో ఏర్పాటు చేసిన కార్గో సర్వీస్‌కు నిత్యం సరాసరి 100నుంచి 150 బుకింగ్స్ వస్తున్నాయి. ఒక్కో బస్‌లో 10టన్నుల వరకు సరుకులు రవాణా చేస్తున్నారు. నారాయణఖేడ్, నారాయణపేట్, మెదక్, నర్సాపూర్, సదాశివపేట, ఖమ్మం, వరంగల్, భువనగిరి, హైదరాబాద్‌కు కూడా సేవలందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు నెలలో సుమారు 200ల నుంచి 300ల వరకు పార్సిళ్లు వస్తున్నాయి. దీంతో డిపోకు నెలకు రూ.3.50లక్షల ఆదాయం వస్తున్నది. సరుకు బరువు, దూరాన్ని బట్టి చార్జీలు వసూలు చేస్తున్నారు. నెల రోజులుగా అంగన్వాడీలకు టీఎస్ఫుడ్, విజయ ఆయిల్‌తో పాటు ఇతర సరుకుల రవాణా చేస్తున్నారు. కార్గో సేవలు ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా అతితక్కువ ధరల్లో అందజేస్తుండటంతో ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు.
కార్గో చార్జీలు..
ఆర్టీసీ కార్గో ద్వారా వివిధ రకాల సరుకులను రవాణా చేస్తున్నది. ఈ సేవలు సరుకుల రకాలు, బరువును బట్టి చార్జీలు వసూలు చేస్తున్నారు. 0 నుంచి 5కేజీల వరకు 50కిలోమీటర్ల దూరం అయితే రూ.30, 6నుంచి 25కేజీల వరకు రూ.70, 26నుంచి 50కిలోమీటర్ల వరకు రూ.100, 51నుంచి 75కేజీల వరకు రూ.130, 76 నుంచి 100కేజీల వరకు రూ.160 నిర్ణయించారు. 50కిలోమీటర్లకు పైన రవాణా చేయాల్సి వస్తే ధరలు పెరుగనున్నాయి. పార్సిల్ కొరియర్లకు 250గ్రాముల వరకు రూ.30, 251నుంచి 500గ్రాముల వరకు రూ.40, 501నుంచి 1000గ్రాముల వరకు రూ.70 చార్జీలు తీసుకుంటున్నారు.
ప్రైవేటు కొరియర్లు అప్ అండ్ డౌన్ చార్జీలు వసూలు చేస్తుండగా.. కార్గోలో మాత్రం ఒక్క రూట్ చార్జీలు మాత్రమే తీసుకుంటున్నారు. 10టన్నుల సరుకులు 50కిలోమీటర్ల వరకు రూ.5,130, వంద కిలోమీటర్ల వరకు రూ.6,590, 150కిలోమీటర్ల వరకు రూ.10,790, 200కిలోమీటర్ల వరకు రూ.12,250 చొప్పున చార్జీలు వసూలు చేస్తున్నారు. అతి తక్కువ ధరలకు దూర ప్రాంతాల నుంచి సరుకులు చేరవేసేందుకు ఆర్టీసీ కార్గో ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు మరింత వినియోగించుకునే రీతిలో ఆర్టీసీ సిబ్బంది, అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
కార్గో సేవలను మరింత విస్తరింపజేస్తున్నాం
కార్గో సర్వీస్‌కు ప్రజల నుంచి రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. నిషేధిత వస్తువులు తప్ప అన్ని రకాల సరుకులు రవాణా చేస్తున్నాం. కార్గో సర్వీస్‌తో పాటు సరుకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నాం. నెలకు కార్గో ద్వారా ఇబ్రహీంపట్నం డిపోకు సుమారు రూ.3.50లక్షలకు పైగా ఆధాయం వస్తున్నది. ప్రజల సౌకర్యార్థం సుమారు 10టన్నుల వరకు రవాణా చేస్తున్నాం.
– అశోక్‌రాజు, డీఎం, ఆర్టీసీ ఇబ్రహీంపట్నం