షాబాద్, ఏప్రిల్ 16: రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం షాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన 62 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. భవిష్యత్‌లో భావితరాలకు ఉపయోగపడేలా సీఎం తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో అన్నదాతలకు వ్యవసాయంపై మరింత నమ్మకం పెరిగిందని చెప్పారు. దళితబంధు ద్వారా అందిస్తున్న ఆర్థిక సాయంతో పేద దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకుండా రైతులను ఇబ్బందులు పెట్టినా…రైతుబిడ్డగా సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి యాసంగి వడ్లను కొంటామని చెప్పడం గొప్ప పరిణామమన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వప్నారెడ్డి, ఎంపీడీవో అనురాధ, తాసిల్దార్ అమరలింగంగౌడ్, డిప్యూటీ తాసిల్దార్ క్రాంతికిరణ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావు, కార్యదర్శి శ్రీరాంరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్‌లు పి. కేతన, యాదమ్మ, జంగయ్య, సీనియర్ నాయకులు పోన్న నర్సింహారెడ్డి, కరుణాకర్, రాంచంద్రారెడ్డి, నర్సింహులు, మల్లికార్జున్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.