మొయినాబాద్, ఏప్రిల్ 16: దేశంలో భిన్న మతాల వారు బతుకుతున్నారు.. ఎవరు ఏ మతం వారైనా సరే భారతీయులుగా జీవించాలని ముఖ్యవక్త త్రిదండి దేవనాథ్ జీయర్ స్వామీజీ అన్నారు. శనివారం హనుమజ్జయంతిని పురస్కరించుకుని హనుమాన్ శోభాయాత్రను బజరంగ్దళ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పుణ్యక్షేత్రమైన చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద శోభాయాత్రను చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ యాత్ర చిలుకూరు ఆల యం నుంచి హిమాయత్‌నగర్, జేబీఐఈటీ మీదుగా మొయినాబాద్ మండల కేంద్రానికి చేరుకున్నది. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై డీజే హోరు, బ్యాండ్ మేళాల చప్పుళ్ల మధ్య భక్తులు నృత్యాలు చేశారు. వివిధ గ్రామాలకు చెందిన యువకులు బైక్ ర్యాలీలతో చిలుకూరు బాలాజీ ఆలయానికి చేరుకుని అక్కడి నుంచి మొయినాబాద్ మండల కేంద్రానికి వచ్చా రు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో త్రిదండి దేవనాథ్ జీయర్ స్వామీజీ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతోపాటు వివిధ గ్రామాలకు చెందిన హనుమాన్ భక్తులు, బజరంగ్దళ్ కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవనాథ్ జీయర్ స్వామీజీ మాట్లాడుతూ హనుమాన్‌లో ఉన్న పట్టుదల, ధైర్యసాహసాలను మనం స్ఫూర్తిగా తీసుకోవాలని సూ చించారు. దేశంలో భిన్న సంప్రదాయాలు, భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ అందరూ ఒకటే జాతీయభావాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ధర్మం వైపు ఉండాలని, ధర్మాన్మి రక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు భక్తులు, నాయకులు ప్రకాశ్, జంగారెడ్డి, గోపాల్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, దశరథ్‌రెడ్డి, జయవంత్, నందకిశోర్, కృష్ణ ,శ్రీకాంత్, రవియాదవ్, కరణ్, సీతారాంరెడ్డి, గణేశ్, వెంకటేశ్, శివకుమార్, లక్ష్మీనారాయణ, రాజుపాల్గొన్నారు.