ఆమనగల్లు, ఏప్రిల్ 14 : చిన్నారులను ఆటపాటలతో పాటుగా వారి మేథస్సును పెంచేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. చిన్నారులు స్వచ్ఛందంగా కేంద్రాలకు తరలివచ్చేలా కథల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తుండగా.. నూతనంగా ప్రవేశపెట్టిన కథల ఉత్సవ కార్యక్రమం మంచి సత్ఫలితాలనిస్తోంది. క్రమంగా కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య కుడా రోజు రోజూకు పెరుగుతున్నది. అంగన్వాడీ కేంద్రాలను ప్లేస్కూళ్లగా మార్చే విధానంలో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నది. కేంద్రాల్లో చిన్నారులకు అంగన్వాడీ టీచర్లు ఆంగ్లరైమ్స్, డ్యాన్స్ నీతికథలు, దేశభక్తితో కూడిన కథలను చెబుతూ చిన్నారుల మేథస్సుకు పదును పెడుతున్నారు.
మరోపక్క కేంద్రాల్లో పౌష్టికాహారం, విద్య, వైద్యాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఉన్న కేంద్రాలను ప్రాథమిక పాఠశాలకు అనుసంధానం చేసి వారికి ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. దీంతో పలువురు చిన్నారుల తల్లిదండ్రులు కేంద్రాలకు తమ చిన్నారులను స్వచ్ఛందంగా పంపిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారులకు ఆంగ్లబోధన కార్యక్రమాల్లో బోధన చేస్తుండంతో తల్లిదండ్రుల ఆనందానికి అంతులేకుండా పోతున్నది. ఇప్పటికే కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం, బాలామృతం అందించడమే కాక, వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1600 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా మెయిన్ కేంద్రాలు 1377, మినీ కేంద్రాలు 223 ఉన్నాయి.
కేజీ టూ పీజీ విద్యలో భాగంగా..
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేజీ టూ పీజీ విద్యలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తున్నది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్య అందుతుందని ప్రభుత్వం భరోసా కల్పించేందుకు కృషి చేస్తున్నది. అంగన్వాడీ కేంద్రాల్లో చేరిన చిన్నారులను నర్సరీల్లో ప్రాథమిక విద్యను అందించి వారిని నేరుగా ప్రాథమిక పాఠశాలల్లో 1 వతరగతిలో అడ్మిషన్ చేస్తారు.
పిల్లలను ఆకట్టుకొనేలా కథలు..
చిన్న, పిల్లలకు ఆటపాటలు అంటే ఇష్టం. కేంద్రాలకు వచ్చే చిట్టిపాపలకు కోసం ఇప్పటికే రంగు రంగుల బొమ్మలను అందించి వారిలో సృజనాత్మకతను పెంపొందిస్తున్నారు. చిన్నారులను ఒక చోట కూర్చోబేట్టి వారికి కథలు, పద్యాలల్లో నీతివ్యాక్యాలు వినిపిస్తున్నారు. ఇప్పటినుంచే చిన్నారులకు పెదరాసి పెద్దమ్మ, రాజుల కథలు చెబుతున్నారు. కేంద్రాల్లో ఎలా ఆకట్టుకోవాలో వారికి శిక్షణ ఇస్తున్నారు.
చిన్నారులతో కేంద్రాలకు కళ వచ్చింది..
అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నది. తల్లి ఒడిలాంటివిగా భావించేలా చిన్నారులను తమ సిబ్బంది ఆట-పాటలతో వారిని ఆడిస్తున్నారు. కేంద్రాల్లో చేపడుతున్న వైవిధ్యమైన కార్యక్రమాల వల్ల కేంద్రాలకు చిన్నారులు పరుగులు పెడుతున్నారు. దీంతో కేంద్రాలన్నీ చిన్నారులతో కళకళాడుతున్నాయి. పౌష్టికాహారంతో పాటు ఇష్టమైన ఆహార పదార్థాలను అందించి చిన్నారులు ఆరోగ్యంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నాం.
– సక్కుబాయి, సీడీపీవో, ఆమనగల్లు ప్రాజెక్టు
అక్షరాలను నేర్పిస్తున్నాం..
అంగన్వాడీలు అంటే ఒకప్పుడు పిల్లలను ఆడించే కేంద్రాలుగా ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేంద్రాలకు వచ్చే చిన్నారులకు అక్షరాలను దిద్దిస్తూ వారికి ప్రిప్రైమరీ పాఠాలు నేర్పుతున్నాం. కథలు, పాటల ద్వారా అక్షరాలను నేర్పిస్తూ వారికి విద్యపై ఆసక్తి పెంపొందించేలా శిక్షణ ఇస్తున్నాం. ఆట-పాటల ద్వారా చిన్నారులకు అక్షరాలు నేర్చుకొనేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం.
– రాములమ్మ, మాలేపల్లి, అంగన్వాడీ కార్యకర్త