పరిగి, ఏప్రిల్ 14 : అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పరిగిలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు, బలహీనవర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలుగకూడదనే ఉద్దేశంతో భరోసా ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు.
కోట్‌పల్లి, ఏప్రిల్ 14 : సామాజిక అసమానతలను రూపుమాపేందుకు అక్షరాస్యత ఒక్కటే సరైన మార్గమని అంబేద్కర్ విశ్వసించారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. కోట్‌పల్లిలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి తోడ్పడ్డ వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు.
బొంరాస్‌పేట, ఏప్రిల్ 14 : అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప మేధావని, ఆయన దేశానికి చేసిన సేవలు ఎప్పుడూ గుర్తుండిపోతాయని కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం బొంరాస్‌పేటలోని ఎంఆర్సీ కార్యాలయం ఆవరణలో నెలకొల్పిన అంబేద్కర్, గాంధీజీ, సర్వేపల్లి రాధాకృష్ణన్, సావిత్రీబాయిపూలే, జయశంకర్‌ల విగ్రహాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. చిన్న రాష్ర్టాల ఏర్పాటుతోనే దేశాభివృద్ధి సాధ్యమని, ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని తెలిపారు.
తాండూరు, ఏప్రిల్ 14 : ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తాండూరులో అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ కుల వివక్షతపై గళం విప్పి అంటరానితనం, అసమానతలను అంతమొందించి వెనుకబడిన కులాలు, తెగలవారికి స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని ప్రసాదించారన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. సంకల్పశక్తి, మేధా సంపత్తితో దళితులు, వెనుకబడినవారికి సమాన హక్కులు వచ్చేలా కృషి చేసినవారు అంబేద్కరని పేర్కొన్నారు.
కులకచర్ల, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ఆశయాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. కులకచర్ల పెద్ద గేటు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకోసం యువత కృషిచేయాలన్నారు. చౌడాపూర్ మండలం లింగంపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి భూమి పూజ చేశారు.
దోమ, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ఆదర్శప్రాయుడని.. ఆయన అడుగుజాడల్లో నడవడం శ్రేయస్కరమని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. దోమ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి జడ్పీటీసీ నాగిరెడ్డితో కలిసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎమ్మెల్యే కేక్ కట్ చేసి అంబేద్కర్ సంఘం నాయకులకు తినిపించారు. మోత్కూర్, బడెంపల్లి గ్రామాల్లో అంబేద్కర్ శోభాయాత్రలు నిర్వహించగా, అయినాపూర్‌లో భోజనాలు ఏర్పాటు చేశారు.
పూడూరు, ఏప్రిల్ 14 : పూడూరులో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. యువకులు అంబేద్కర్ ఆశయసాధనకు నిరంతరం కృషి చేయాలన్నారు.
పెద్దేముల్, మండలపరిధిలోని పలు గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు, దళిత సంఘాల నాయకులు, జై భీమ్ యూత్ సభ్యులు నివాళులర్పించారు. పెద్దేముల్లో జై భీమ్ యూత్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రధాన పుర వీధుల గుండా అంబేద్కర్ జ్ఞాన యాత్రను ఆటపాటల మధ్య ఉత్సాహంగా నిర్వహించారు.
ధారూరులో వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, పలువురు నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వీరేశం పంచాయతీ కార్మికులను సన్మానించారు.
బంట్వారం మండలంలో వివిధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు నివాళులర్పించారు.
కొడంగల్‌లో గాంధీనగర్ వీధి నుంచి అంబేద్కర్ కూడలి వరకు అంబేద్కర్ యువజన సంఘంతోపాటు పలు దళిత, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు.
బొంరాస్పేటతోపాటు పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు. దుద్యాల గ్రామంలో సాయంత్రం అంబేద్కర్ శోభాయాత్ర నిర్వహించారు.
పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అరవిందరావు, ఎంపీడీవో శేషగిరిశర్మ నివాళులర్పించారు.
తాండూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో సర్పంచ్‌లు, అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు, నాయకులు నివాళులర్పించారు.
మర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లలిత, జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి సిబ్బందితో కలిసి నివాళులర్పించారు. ఎన్కతల గ్రామంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌గౌడ్ నివాళులర్పించారు. యువత ప్రధాన వీధుల గుండా ర్యాలీలు నిర్వహించారు.