ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 13: యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది. బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రైతులతో పాటు ప్రజాప్రతినిధులు క్షీరాభిషేకాలు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. సీఎం కేసీఆర్ జిందాబాద్.. జై తెలంగాణ.. జైజై తెలంగాణ..’ అన్న నినాదాలు మార్మోగాయి. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కార్‌కు వెన్నంటి ఉంటామని ఉమ్మడి జిల్లా రైతులు జేజేలు పలికారు. వరి ధాన్యాన్ని కొనాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినా స్పందించని బీజేపీకి రాబోవు రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని రైతన్నలు హెచ్చరించారు. రైతు బిడ్డగా రైతు కష్టాలు గుర్తెరిగిన సీఎం కేసీఆర్ తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవద్దని, క్వింటాలుకు రూ.1960 ఇస్తామనడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి రాష్ట్ర రైతు ప్రయోజనాలే ముఖ్యమని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వడ్లను కొనబోమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెగేసి చెప్పినా… అన్నం పెట్టే రైతన్న ఆగం కావొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో చివరిగింజ వరకూ కొంటామని చెప్పడం హర్షణీయమని ఆయన కొనియాడారు. బుధవారం ఇబ్రహీంపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను మోసం చేసిందన్నారు.
యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి , దశలవారీగా ఉద్యమాన్ని చేపట్టినా పట్టించుకోలేద న్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అన్నదాతలను ఆదుకునేందుకు ముందుకొచ్చి ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గింజనూ కొంటామని చెప్పినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని హర్షిస్తూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతులు, ప్రజలు మంగళవారం నుంచి ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ ఆకుల యాదగిరి, పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి
కొడంగల్, ఏప్రిల్ 13: సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి ఎన్నో అద్భుత పథకాలను అందించి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్ తెలిపారు. బుధవారం ధాన్యం కొనుగోలుపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిశేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. స్థానిక పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో కేసీఆర్ చిత్రపటానికి ధాన్యంతో పాటు క్షీరాభిశేకం, చిన్ననందిగామ గ్రామంలో క్షీరాభిశేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం యాసంగి వడ్లను కొనుగోలు చేయమని చేతులు ఎత్తేసినప్పటికీ రైతులు నష్టపోవద్దనే ఆలోచనతో ముఖ్యమంత్రి ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసాను కల్పించినట్లు తెలిపారు. కాబట్టే రైతులు సీఎం కేసీఆర్‌ను దేవుడుగా భావిస్తున్నట్లు పేర్కొ న్నారు. అదేవిధంగా మండలంలోని చిన్ననందిగామ గ్రామంలో సర్పంచ్ సావిత్రమ్మ సాయిలు, పీఏసీఎస్ డైరెక్టర్ చిదిరి వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో రైతులు సీఎం చిత్ర పటానికి క్షీరాభిశేకం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కటకం శివకుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏన్గుల భాస్కర్, పీఏసీఎస్ డైరెక్టర్ దత్తురెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు వన్నె బస్వరాజ్, సర్పంచ్ సయ్యద్ అంజద్, కో ఆప్షన్ సభ్యులు ముక్తార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేష్‌బాబుతో పాటు బాల్‌రాజ్ పాల్గొన్నారు.
బొంరాస్‌పేట, ఏప్రిల్ 13: సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని మరోసారి నిరూ పించు కున్నా రని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అన్నారు. యాసంగి వరిధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం బొంరాస్‌పేటలో కేసీఆర్ చిత్రపటానికి నాయ కులు, రైతులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేం ద్రం యాసంగి వడ్లను కొనబోమని ప్రకటించినా సీఎం కేసీఆర్ రైతులు నష్టపోరాదన్న ఉద్దేశంతో యాసంగిలో పండించిన వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రక టించి రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారని అన్నారు. తెలంగాణ రైతుల పట్ల కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతుందని వారు విమర్శించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీ శ్రవణ్‌గౌడ్, కో-ఆప్షన్ సభ్యుడు ఖాజా మైనుద్దీన్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు మహేందర్, సింగిల్‌విండో డైరెక్టర్ సుభాష్‌రావు, పార్టీ నాయకులు రామకృష్ణయాదవ్, లచ్చప్ప పాల్గొన్నారు.
సీఎం ప్రకటనతో రైతులకు ఊరట
దోమ, ఏప్రిల్13: రైతుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన సందర్భంగా దోమ మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌కు బుధవారం గ్రామ పంచాయితీ దగ్గర సీఎం కేసీఆర్ చిత్ర పటానికి టీఆర్ఎస్ నాయకులు, రైతులు క్షీరాభిషేకం చేశారు. యాసంగి సీజన్లో వరి సాగు చేసి అమ్ముకోవడానికి అయోమయంలో ఉన్న రైతులకు సీఎం కేసీఆర్ ప్రకటన ఊరటనిచ్చిందని దోమ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, రైతు బంధు కోఆర్డినేటర్ లక్ష్మయ్యముదిరాజ్ అన్నారు. గతంలో మాదిరిగానే ఊరికో కొనుగోలు కేంద్రం, క్వింటాలు మద్దతు ధర 1960/రూపాయలు నిర్ణయించడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గోపాల్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజగోపాల చారి, టీఆర్ఎస్ నాయకులు నరేందర్‌రెడ్డి, శ్రవన్‌కుమార్‌రెడ్డి,గొల్ల వెంకటేశ్ ,వార్డు సభ్యులు డప్పు రమేశ్, ఆం జనేయులు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.