షాబాద్, ఏప్రిల్ 13 : మత్తు పదార్థాల నియంత్రణ కోసం మరే ఇతర రాష్ర్టాల్లో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయంతో ముందుకు సాగుతున్నదని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రావు అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం తెలంగాణను మత్తు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది, నూటికి నూరు శాతం సత్ప్రవర్తన కలిగిన సమాజంగా మార్చాలనే ఉదాత్తమైన ఆశయంతో మత్తు పదార్థాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నదని తెలిపారు. రేపటి పౌరులైన నేటి బాలలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారినట్లయితే, వారు విచక్షణను కోల్పోయి పశు ప్రవర్తనను అలవర్చుకుని, తమ కుటుంబానికే కాకుండా యావత్ సమాజానికే హానికరంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు.
కలెక్టర్ అమయ్‌కుమార్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేస్తూ మత్తు పదార్థాల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మత్తు పదార్థాలు వినియోగించే వారిని స్థానిక ప్రజలే నిలదీసే స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై కన్నేసి ఉంచాలని, వారి ప్రవర్తన దారి తప్పుతున్నట్లు గమనిస్తే వెంటనే వారికి చెడు వ్యసనాల వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. మత్తు పదార్థాల నియంత్రణ పోరాటంలో ప్రతిఒక్కరినీ భాగస్వాములను చేస్తూ గ్రామగ్రామాన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ శ్రీదేవి, టీఎస్పీసీఆర్ సభ్యులు దేవయ్య, అంజన్‌రావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, డీసీపీ మురళీధర్, క్రైం డీసీపీ కల్మేశ్వర్, జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్, జిల్లా సంక్షేమాధికారి మోతీ, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, మైనార్టీ సంక్షేమాధికారి రత్నకళ్యాణి, గిరిజన సంక్షేమ అధికారి రామేశ్వరి, పోలీసు అధికారులు, సఖి, చైల్డ్‌లైన్ యూనిట్, ఎక్సైజ్ అధికారులున్నారు.