పరిగి, ఏప్రిల్ 8 : వికారాబాద్ జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుల ఉప ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచించారు. దీంతో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఉప ఎన్నికల కోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా పరిధిలో 9 ఎంపీటీసీ, 9 సర్పంచ్, 335 వార్డుసభ్యుల స్థానాలు, వికారాబాద్‌లోని 19వ వార్డు కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
జిల్లాలో ఎన్నికలు జరిగే స్థానాలు..
వికారాబాద్ జిల్లా పరిధిలో 9 ఎంపీటీసీలు, 9 సర్పంచ్ స్థానాలు, 335 వార్డు సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. వికారాబాద్ జిల్లా పరిధిలోని 18 మండలాల్లో 221 ఎంపీటీసీ స్థానాలుండగా వివిధ కారణాల వల్ల 9 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. నవాబుపేట్ మండలం మహ్మదాన్పల్లి, ధారూర్ మండలంలోని ధారూర్, పీసీఎం తండా, నాగసముందర్, అల్లీపూర్, బషీరాబాద్ మండలంలోని దామర్‌చెడ్, దోమ మండలంలోని బుద్లాపూర్, కులకచర్ల మండలంలోని కుస్మసంద్రం, కొడంగల్ మండలంలోని పెద్ద నందిగామ ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి.
జిల్లాలో 566 గ్రామపంచాయతీలు ఉండగా వాటిలో 9 సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దౌల్తాబాద్ మండలంలోని ఇమ్డాపూర్, యాలాల్ మండలం తిమ్మాయిపల్లి, పూడూరు మండలం కొత్తపల్లి, పెద్దేముల్ మండలం మారేపల్లితండా, బషీరాబాద్ మండలం నవాల్గ, యాలాల్ మండలం రెల్లగడ్డతండా, కులకచర్ల మండలం అనంతసాగర్, పరిగి మండలం కాళ్లాపూర్, వికారాబాద్ మండలం నారాయణపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 335 వార్డుసభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 97 వార్డులుండగా వికారాబాద్‌లోని 19వ వార్డు కౌన్సిలర్ స్థానానికి ఉప ఎన్నిక జరుగనున్నది.
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన..
జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులు, కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం జరిగింది. 2022 జనవరి 5వ తేదీన ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించే వార్డుల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను శుక్రవారం వెల్లడించారు. ఈనెల 11 నుంచి 16వ తేదీ వరకు వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 19వ తేదీన తుది జాబితాను సిద్ధం చేసి ఈనెల 21వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. ఈనెల 23వ తేదీన ఎన్నికలు జరిగే ఎంపీటీసీల వారీగా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. ఆయా వార్డులు, గ్రామాల్లో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఎంతమంది ఎన్నికల సిబ్బంది అవసరమవుతారు తదితర అంశాలు పరిశీలించనున్నారు. ఈ నెలాఖరు లోపు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్ల ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వివరాలు అందజేయనున్నారు. ఏదిఏమైనా ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికలతో గ్రామాల్లో మళ్లీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కనున్నది.
ఉప ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నాం
వికారాబాద్ జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సిద్ధం చేసి ముసాయిదా జాబితా ప్రకటించాం. అభ్యంతరాల తర్వాత ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తాం. అనంతరం పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది తదితర అంశాలపై దృష్టి పెట్టడంతోపాటు ఇతర ఏర్పాట్లు చేపడతాం. ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలని ఆదేశించినా మేము సిద్ధంగా ఉన్నాం.
– మల్లారెడ్డి, వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి