అబ్దుల్లాపూర్మెట్, డిసెంబర్ 10 : సామాన్యులతో పాటు విద్యావంతులు కూడ మూఢనమ్మకాల్లో ఉంటున్నారని, ఇకనైనా మెల్కొని విడనాడాలని వికారాబాద్ జిల్లా జడ్జి కె.సుదర్శన్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలోని హ్యూమనిస్ట్ సెంటర్లో మానవ వికాస వేదిక 12వ వార్షికోవాలను పురస్కరించుకొని పలు అంశాలపై రెండు రోజుల పాటు నిర్వహించే అవగాహన తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మూఢనమ్మకాల కారణంగా కొంతమంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని తెలిపారు. ప్రజల్లో విజ్ఞాన ప్రచారం పెరగడానికి మానవ వికాస వేదిక లాంటి సంస్థలు అవసరమన్నారు.
భారత హేతువాద సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ నరేంద్ర నాయక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వైద్యం పేరుతో అమలవుతున్న అశాస్త్రీయ విధానాలు ప్రజలను పీడిస్తున్న విషయాలను వివరించారు. సీనియర్ పాత్రికేయులు ఎన్ వేణుగోపాల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా హిందుత్వ భావజాలం ప్రమాదకరంగా మారిందన్నారు. అంకురం బాలల సంస్థ వ్యవస్థాపకురాలు సుమిత్ర మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు మానవీయ విలువల్లో రావాల్సిన మార్పులను వివరించారు. రామాయణం-చారిత్రక పరిశీలన అనే అంశంపై మానవ వికాస వేదిక కేంద్ర కమిటీ అధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఎస్ఎన్ మూర్తి, తుమ్మా భాస్కర్, రొంటాల బుచ్చయ్య, ఎంఎన్ గుప్తా, అనంతరామయ్య, రాజేశ్వరి, శ్రీకాంత్, లీల, కృష్ణకుమారి పాల్గొన్నారు.