ఇబ్రహీంపట్నం రూరల్, మార్చి 19: అనవసరంగా సెల్‌ఫోన్ అధికంగా వినియోగిస్తున్నారా? వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా సమయం గడుపుతున్నారా? మనకు సంబంధం లేని పోస్టులకు లైక్‌లు కొట్టడం, షేర్ చేయడంలో బిజీగా ఉన్నారా? అయితే మీరు ఉన్నత చదువులు చదివి.. ఉద్యోగ వేటలో ఉం టే ఇవన్నీ ఆపేయండి! సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా భారీసంఖ్యలో కొలువులను భర్తీ చేస్తామని ప్రకటించారు. నోటిఫికేషన్స్ జారీ చేసేందుకు కసరత్తు కూడా జరుగుతున్నది. అయితే మీకు ఇదే మంచి అవకాశం. సోషల్ మీడియాను పక్కన పెట్టి.. ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్లండి. టెక్నాలజీని సరైన విధంగా వాడుకోండి. సామాజిక మాధ్యమాలకు వినియోగిం చే సమయాన్ని ప్రిపరేషన్‌పై పెట్టండి. మీకు ఉద్యోగం రావడం ఖాయం. ఆలోచించండి.. నిర్ణయం తీసుకోవాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ సెల్ఫోన్లు ప్రతి ఒక్కరి చేతుల్లోనూ కనిపిస్తున్నాయి.
గతంలో కేవలం మాట్లాడ డం కోసమే చిన్న, చిన్న ఫోన్లను వినియోగించేవారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగడం.. 4జీ, 5జీ వంటి నెట్‌వర్క్‌లు అందుబాటులోకి రావడంతో కంపెనీలు కూడా వివిధ రకాల యాప్‌లు, పలు ఫీచర్లతో కూడిన మొబైల్స్‌ను తయారు చేస్తున్నాయి. రూ.5 వేల నుంచి రూ.50 వేల ధర వరకు ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. కొవిడ్ ప్రభావంతో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేసి ఆన్లైన్ క్లాసులను ప్రారంభించాయి. దీంతో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యువతీయువకులు ఫోన్లు కొనుగోలు చేశారు. దీంతో ఫోన్ల వాడకం కూడా పెరిగింది. ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభమైనా ఫోన్ల వాడకం తగ్గడం లేదు. గుడ్ మార్నింగ్ మొదలుకుని గుడ్‌నైట్ వరకు స్నేహితులు, బంధువులతో ప్రతి రో జూ చాటింగ్ చేస్తున్నారు. ఫోన్ల అధిక వాడకంతో రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నా యువత పట్టించుకోవడంలేదు. నిత్యం 4 నుంచి 6 గంటల వరకు ఫోన్‌కే సమయాన్ని కేటాయిస్తున్నారు.
అధికంగా సెల్‌ఫోన్ వినియోగం
విద్యార్థులు, యువతీయువకులు సెల్‌ఫోన్‌ను అధికం గా వినియోగిస్తున్నారు. తల్లిదండ్రులు, బంధువులు పక్కనే ఉన్నా వారితో మాట్లాడకుండా సోషల్ మీడియాపైనే దృష్టి సారిస్తున్నారు. వారికి సంబంధం లేని అంశాలను చూస్తూ పెడదోవ పడుతున్నారు. అధిక సమయం కేటాయిస్తూ ఇంటి పనులను చేయకపోవడంతోపాటు సమయానికి భోజనం కూడా చేయడం లేదు. తల్లిదండ్రులు ఏమైనా అంటే వారిపైకే కోపానికి వస్తున్నారు. వివిధ రకాల గేమ్‌లు ఆడుతూ సహనాన్ని కోల్పోయి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో గొడవకు దిగుతున్నారు. గతంలో వీడియో గేమ్‌లు ఆడిన పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు వెలు గుచూశాయి. యువత సెల్ఫోన్ల వాడకం చూసి తల్లిదండ్రులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. చాలా కుటుంబాల్లో ఇదో సమస్యగా మారింది.
ఫోన్ పక్కన పెడితే..
సీఎం కేసీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రకటనతో రంగారెడ్డి జిల్లాలోనూ అధికంగా కొలువులు భర్తీ కానున్నాయి. జోనల్ విధానం కారణంగా స్థానిక యువతకు ఉద్యోగాలు దక్కనున్నాయి. ప్రభుత్వం వివిధ పోటీ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఉచితంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయిస్తున్నది. అంతేకాకుండా విద్యార్థులు చదువుకునేందుకు స్టడీ మెటీరియ ల్, అన్ని రకాల పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచుతున్నది. ప్రతిరోజూ సెల్‌ఫోన్ కోసం గంటల సమయం కేటాయిస్తున్న యువకులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవడంతో పక్కదారి పడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంటా రు. సర్కారు భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో విద్యార్థులు సెల్ఫోన్లను పక్కన పెట్టాలి. చదువడానికి సమయం కేటాయించి తల్లిదండ్రుల కలలను నిజం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగంతో జీవి తంలో స్థిరపడొచ్చు.
ఫోన్ పక్కన పెడితే ఉద్యోగం పక్కా
సెల్ఫోన్ల వాడకం బాగా పెరిగింది. అవసరం ఉన్నా లేకున్నా విద్యార్థులు, యువతీయువకులు సెల్ఫోన్లు వాడు తూ విలువైన సమయా న్ని వృథాచేస్తున్నారు. వారి భవితపై ఫోన్ల ప్రభా వం పడుతుంది. ఓపిక, సహనం కోల్పోతూ ఆరోగ్యాన్ని కూడా పాడుచేసుకుంటున్నారు. సెల్‌ఫోన్ వినియోగం వ్యసనంలా మారింది. ప్రభుత్వం భారీ సం ఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తుండటంతో యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పట్టుదలతో చదివితే విజయం తథ్యం. సెల్ఫోన్లకు దూరంగా ఉండి ఉద్యోగాన్ని సాధించాలి
-మైలారం విజయ్‌కుమార్, విద్యార్థిసంఘం నాయకుడు
ఇంటివద్దే ప్రిపేర్ అవుతున్నా..
డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నా. గతంలో కోచింగ్ తీసుకున్నా. ప్రతి బుధవారం ‘నమస్తేతెలంగాణ’లో వస్తున్న ‘నిపుణ’ను చదువుతున్నా. పోటీ పరీక్షలకు సంబంధించిన నోట్స్ బాగా ఇస్తున్నారు. ఈ ఏడాది ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో సెల్‌ఫోన్ పక్కనపెట్టి కష్టపడి చదువుతున్నా.
-మోటే మహేశ్
క్రమశిక్షణతో చదివితే..
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న సంకల్పంతో కష్టపడి చదివితే ఉద్యోగాన్ని సాధించొచ్చు. ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేస్తున్న ఉచిత శిక్షణను తీసుకొని ఎం తోమంది నిరుద్యోగులు పట్టుదలతో చదివి ఉద్యోగాలను సాధిస్తున్నారు. సెల్ఫోన్ల వాడకాన్ని బాగా తగ్గించాలి. కేవలం విద్యారంగానికి సంబంధించిన వివరాలను మాత్రమే చూడాలి. పోటీ పరీక్షలు ముగిసేవరకూ సెల్ఫోన్లకు దూరంగా ఉండటం మంచిది. ప్రతిరోజూ 8 గం టల పాటు చదివితే కచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
– జెర్కోని రాజు, ఎంకేఆర్ ఫౌండేషన్ కార్యదర్శి