పహాడీషరీఫ్, మార్చి 19: తెలంగాణలో చరిత్రాత్మకమైన పహాడీషరీఫ్ బాబా షర్ఫుద్దీన్ దర్గా ఉర్సు ఉత్సవాలు ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. చార్మినార్కు 11 కిలో మీటర్ల దూరంలో, శంషాబాద్ ఎయిర్పోర్టుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దర్గా 756 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ప్రతి ఏడాది జరిగే బాబా షర్ఫుద్దీన్ ఉర్సుకు కుల మతాలకు అతీతంగా హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి దర్గాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు.
పహాడీషరీఫ్ దర్గా చరిత్ర
ఇస్లాం మత ప్రచారం కోసం 755 ఏళ్ల కిందట ఇరాక్ దేశం బాగ్దాద్ నుంచి కుతుబ్-హుల్-అక్తాన్ షాహెన్షా-ఇ దక్కన్ సుల్తాన్ అర్ఫీల్ బాబా షర్ఫుద్ధీన్ భారతదేశానికి తరలివచ్చి తెలంగాణ ప్రాంతమైన హైదరాబాద్ శివారు బాలాపూర్ గ్రామంలో విశ్రాంతి తీసుకొని అక్కడ స్థిరపడ్డారు. పహాడీ షరీఫ్ కొండపైకి వెళ్లి అల్లాను ప్రార్థించేవారు. ఈ భారీ కొండపైకి వెళ్ళాలంటే భక్తులు చాలా కష్టపడేవారు. చిన్నారులు, వృద్ధులను దృష్టిలో ఉంచుకుని కింది నుంచి దర్గాపైకి ర్యాంపు నిర్మాణానికి ప్రభుత్వం రూ.16 కోట్లు కేటాయించింది. దర్గా ఉర్సు సమయంలో అవాంఛనీయమైన ఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 30 మంది, రాత్రి 30 మంది పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారని పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
కుల మతాలకు అతీతంగా దర్శనం
కుల మతాలకు అతీతంగా భక్తులు దర్గాను దర్శించుకుంటారు. బాబా షర్ఫుద్దీన్ మందిరాన్ని దర్శించుకోవడం కోసం హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా విచ్చేస్తుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. భక్తులు క్యూ పద్ధతి పాటించి దర్గాను దర్శించుకోవాలి.
– ఫరీదుద్దీన్, అధ్యక్షుడు, పహాడీ షరీఫ్ దర్గా కమిటీ
ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
దర్గా ఉత్సవాల సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు దర్గా వద్ద విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయించాం. మంచి నీటి సౌకర్యం కల్పించాం. పారిశుధ్యం లోపించకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. మున్సిపాలిటీ సిబ్బంది ఉత్సవాలు ముగిసే వరకు దర్గా కమిటీ సభ్యులకు అందుబాటులో ఉంటారు.
– జీపీ కుమార్, కమిషనర్, జల్పల్లి మున్సిపాలిటీ