మోమిన్‌పేట, మార్చి 19 : ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందించి, గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం సయ్యద్ అలీపూర్ గ్రామంలో పర్యటించి గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులనడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయా అని ఆరా తీశారు. కరెంట్, మిషన్ భగీరథ నీటి కొరత, మురుగు కాలువలు, రెవెన్యూ సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామంలో మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇంటింటికీ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు మధ్యలో ఉన్న పాత కరెంట్ స్తంభాలను తొలగించి అవసరమైన చోటుకు మార్చాలని, వీధి దీపాలకు ఆన్ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేస్తూ థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామం, పంట పొలాల్లో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలన్నారు.
12 నుంచి 14 ఏండ్ల పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ వేయించాలని, ప్రజలందరూ ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ 2 టీకాలు వేయించుకోవాలని తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న బావులపై కప్పులు ఏర్పాటు చేయాలని గ్రామపంచాయతీ సిబ్బందికి సూచించారు. రెవెన్యూ సమస్యలపై ధరణి పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఆప్షన్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామానికి చెందిన కృష్ణయ్య అనారోగ్యంతో ఇటీవల మృతిచెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌గౌడ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు హరిశంకర్, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.