ఆమనగల్లు, మార్చి 19: సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. రాష్ట్రంలో జోన్లు, మల్టీజోన్లు, జిల్లాల వారీగా వివిధ శాఖల్లోని అన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు వివిధ శాఖల అధికారులు సీఎం కేసీఆర్ ఆదేశానుసారం కసరత్తు మొదలెట్టారు. దీంతో కొంతకాలంగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న యువతీయువకులు, నిరుద్యోగులు ఉద్యోగాలను సాధించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో వివిధ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న పలువురు అధికారులు పోటీ పరీక్షలకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. ఉద్యోగాలను ఏలా సాధించాలి… ఏఏ సబ్జెక్టులను చదువాలి తదితర విషయాలను వివరించారు. ప్రణాళిక, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించ వచ్చని వారు సూచిస్తున్నారు.
బట్టీ చదువులు ఆపాలి..
పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే బట్టీ చదువులను ఆపాలి. సంబంధిత సబ్జెక్టులను విషయాలకనుగుణంగా మొదట చదివి, వాటిని అర్థం చేసుకోవాలి. ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోవాలి. చదివిన ప్రతి అంశాన్నీ అవకాశం ఉన్న సమయాల్లో గుర్తు చేసుకోవాలి. ముందుగా మనం ఏ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నామో వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలి. అందుకు అవసరమైన మెటీరియల్‌ను సిద్ధం చేసుకోవాలి. వాటితోపాటు తెలుగు అకాడమీ పుస్తకాలను కూడా చదువాలి. మార్కెట్లో విరివిగా లభించే పుస్తకాలను చదువొద్దు. గతంలోని మోడల్ పేపర్లను పరిశీలించాలి. మనకు అందుబాటులో ఉన్న కోచింగ్ సెంటర్లో చేరి క్రమశిక్షణతో చదివితే కొలువు మన సొంతం.
-శ్యామ్‌సుందర్, మున్సిపల్ కమిషనర్, ఆమనగల్లు
తెలుగు అకాడమీ పుస్తకాలను చదువాలి
గ్రూప్-1,గ్రూప్-2 తదితర పోస్టులకు సన్నద్ధమయ్యే ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ముఖ్యమైన దినపత్రికలతోపాటు నమస్తే తెలంగాణ పేపర్ అందించే నిపుణ లాంటివి చదివితే సమకాలిన అంశాలపై పట్టుసాధిస్తారు. ప్రతిరోజూ జీకే, కరెంట్ అపైర్స్ ఎడిటోరియల్స్‌ను క్షుణ్ణంగా చదివి నోట్ చేసుకోవాలి. ఆరోతరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగు అకాడమీకి చెందిన పుస్తకాలను చదివి అర్థం చేసుకోవాలి. ప్రపంచం, దేశం, తెలంగాణ ప్రత్యేక రాష్ర్టానికి సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. సిలబస్ ప్రకారం పరీక్షల వరకు అన్ని సబ్జెక్టులు పూర్తి అయ్యేలా ప్లాన్ రూపొందించుకోవాలి. గతంలో మల్టీపుల్ ప్రశ్నలు ఇచ్చేవారు.. కానీ ప్రస్తుతం పూర్తి అంశాలను సమగ్రంగా, లోతుగా అర్థం చేసుకుంటేనే ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసే వీలుంటుంది. ప్రతి టాఫిక్, అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా భౌగోళిక శాస్త్రం, సామా న్య శాస్త్రం, చరిత్ర, ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలి. ఉద్యోగార్థులకు ఏమైనా సందేహాలు, సలహాలు కావాలంటే నన్ను సంప్రదించొచ్చు.
-ఉపేందర్, సీఐ ఆమనగల్లు
సమయ పాలన పాటించాలి
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారందరూ మొదట సమయ పాలన పాటించాలి. తాము ఎంచుకొన్న పోస్టుకు ఎలా సన్నద్ధం కావాలనే అంశాలపై ప్లాన్ చేసుకోవాలి. పోటీపరీక్షలకు సమూహంగా సిద్ధమైతేనే బెటర్‌గా ఉంటుంది. ప్రిపరేషన్లో ఏమైనా సందేహాలొస్తే అక్కడిక్కడే తీర్చుకోవచ్చు. అంతేకాకుండా సంబంధిత సబ్జెక్టులకు చెందిన అంశాలను అందరూ కలిసి చర్చించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువగా గతంలో వచ్చిన పోటీ పరీక్షల మోడల్ పేపర్లను సాధన చేయాలి. దీనివల్ల మనకు సమయపాలనపై పట్టు వస్తుంది. అంతేకాకుండా నిర్ణీత సమయంలో పరీక్షను పూర్తి చేసేలా అవగాహన పెరుగుతుంది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ఏమి చదువాలో సబ్జెక్టులను విభజించుకుని ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. గతంలో కోచింగ్ తీసుకుంటే మళ్లీ తీసుకోవద్దు. అయితే అది వారి వ్యక్తిగత అభిప్రాయం. అందివచ్చిన అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని తమ కలలను నెరవేర్చుకోవాలి.
-చలమందరాజు, సీఐ ఎన్ఫోర్స్మెంట్, నల్గొండ