మంచాల, అక్టోబర్ 26 : బుగ్గరామలింగేశ్వర స్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని, ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. నవంబర్ 8నుంచి ప్రారంభం కానున్న బుగ్గరామలింగేశ్వర స్వామి జాతర కార్తిక పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 15 రోజుల పాటు జరుగనున్నందున ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. విద్యుత్, తాగునీటి సరఫరా, వైద్యశాఖ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్టీసీ, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు.
కాశీ తర్వాత మరో కాశీగా పేరుపొందిన బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్నదని, అందుకే ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. జాతరలో ఎవరైనా మద్యం విక్రయించినైట్లెతే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దేవాలయ ఆవరణలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఉత్సవాలు ముగిసే వరకు 24గంటలు భక్తులకు వైద్యులతో పాటు 108 సేవలను అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు నిరంతరం ఆ శాఖకు సంబంధించిన అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమగ్ర ప్రణాళికతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ జాటోతు నర్మద, సర్పంచ్ కొంగర విష్ణు వర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీలు చీరాల రమేశ్, కావలి శ్రీనివాస్, సహకార సంఘం చైర్మన్ బుస్సు పుల్లారెడ్డి, ఉపసర్పంచ్ జంగయ్య గౌడ్, ఎంపీడీవో శ్రీనివాస్, సీఐ వెంకటేశ్ గౌడ్, ఏఈ అబ్బాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మంచాల : సీఎం సహాయనిధి పథకం ప్రజలకు వరం లాంటిదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. అస్మత్పూర్ గ్రామానికి చెందిన నౌసు రామయ్య సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకోగా ఆయనకు రూ. 60 వేలు మంజూరయ్యాయి. ఆ చెక్కును గ్రామ సర్పంచ్ హరిప్రసాద్‌తో కలిసి బాధితుడికి ఎమ్మెల్యే అందజేశారు.