సిటీబ్యూరో/మాదాపూర్,అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ):నగరవాసులు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదానికి పెద్దపీట వేస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ..తమ కలల గృహం పచ్చగా ఉండాలని అభిలాషిస్తున్నారు. ఈ నేపథ్యంలో హరిత భవనాలకు డిమాండ్ పెరుగుతున్నది. దీంతో బిల్డర్లు సైతం అభిరుచికి తగ్గట్టుగా పర్యావరణానికి హాని చేయని భవనాలను నిర్మిస్తున్నారు. రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, అపార్ట్మెంట్లు, ఐటీ పార్కులు ఎక్కువగా వస్తున్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండటంతో ఈ తరహా గృహాలు నగరవాసులను బాగా ఆకర్షిస్తున్నాయి. మరోవైపు భవన నిర్మాణ రంగంలో పర్యావరణ హితమే లక్ష్యంగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ పనిచేస్తోంది. ఏటా నిర్మాణ రంగానికి అవసరమైన ఉత్పత్తుల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేలా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా హెచ్ఐసీసీలో గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్-2022 సదస్సు నిర్వహించారు. ఇందులో వందలాది కంపెనీలు తమ పర్యావరణ హిత ఉత్పత్తులతో స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రదర్శనకు ఉంచాయి. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఉత్పత్తులు, నిర్మాణ సామగ్రిని ప్రదర్శించాయి.
వ్యర్థాలు కరిగించి.. కంకరగా మార్చి..
జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లు, 30 సర్కిళ్ల పరిధిలోని నిర్మాణ వ్యర్థాలను సేకరించి వాటిని ఫతుల్లాగూడ, నాగోల్, జీడిమెట్ల వద్ద ఉన్న ప్లాంట్‌కు తీసుకువెళ్తారు. వాటిని క్రషింగ్ మెషిన్లో వేయడం ద్వారా వచ్చిన పలు సైజులతో కూడిన కంకరను విడి విడిగా ఉంచి మార్కెట్ రేటు కన్నా.. 50 శాతం తక్కువ ధరకు విక్రయిస్తారు. ఇవి రోడ్లు, ఇండ్లు, పెద్ద పెద్ద భవనాలు, వంతెనల నిర్మాణం, రైల్వే పనుల్లో, ఎయిర్పోర్ట్ వంటి కన్స్స్ట్రక్షన్కు సంబంధించిన పనుల్లో వాడేందుకు వీలుగా ఉంటుంది. టోల్ ఫ్రీ నంబర్ 18001201159లో సంప్రదించినట్లయితే స్వయంగా వచ్చి తక్కువ చార్జీలతో వ్యర్థాలను తీసుకెళ్తారు. ఈ ప్రాజెక్టును చేసేందుకు రాంకీ ఇంజినీరింగ్ వారు జీహెచ్ఎంసీతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
మురుగు నీటిని శుద్ధి చేసే విధానం..
బ్లూ డ్రాప్ ఎన్విరో ప్రైవేటు లిమిటెడ్ సంస్థ వారు ఫోర్డ్స్ ఎరేషన్ టెక్నాలజీ ఆధారంగా మురుగు నీటిని సైతం శుద్ధి చేసే ప్రక్రియను తీసుకొచ్చారు. ఏదైనా అపార్ట్మెంట్లో 20 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారనుకోండి.. అందులో 20 కుటుంబాలకు 20 గజాల స్థలంలో ఈ టెక్నాలజీని ఉపయోగించి అపార్ట్మెంట్ ద్వారా వచ్చిన మురుగునీటిని శుద్ధి చేస్తారు. ఒకసారి ఈ సాంకేతికతను వాడితే 30 సంవత్సరాలకు పైగా పనిచేస్తుంది.
సామగ్రి అంతా పర్యావరణ హితమే
మా కంపెనీ పూజా క్రాఫ్టెడ్ హోమ్స్ పచ్చదనం ఎక్కువగా ఉండే ప్రాజెక్టులనే చేపడుతోంది. ప్రాజెక్టుల్లో చెట్లను పెంచడమే కాకుండా భవన నిర్మాణానికి వాడే ఉత్పత్తులు, ఇతర సామగ్రి సైతం పర్యావరణ హితమైనవి వినియోగిస్తూ హైదరాబాద్ నగరంలో హైరైజ్ భవనాలు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు చేపడుతున్నాం. కోకాపేటలో 35 అంతస్తులతో ది హర్వెస్ట్ పేరుతో నిర్మిస్తున్న హైరైజ్ భవనం పూర్తిగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా నిర్మిస్తున్నాం.
-రవీంద్ర, డైరెక్టర్, పూజా క్రాఫ్టెడ్ హోమ్స్
సూర్యరశ్మీ తీవ్రత 90శాతం తగ్గేలా
భవనాల్లోకి వచ్చే వేడిని తట్టుకునేలా, లోపలికి చాలా తక్కువ వేడి వచ్చేలా ఇన్ప్లెక్టర్ను దేశంలో వినియోగించేందుకు ఇండియా ఇన్ప్లెక్టర్ కంపెనీ జీరో పొల్యూషన్- నెట్ జిరో 2040 పేరుతో కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. ఇన్ప్లెక్టర్ షీట్‌తో 80-90 శాతం వేడిని లోపలికి రాకుండా అడ్డుకుంటుందని కంపెనీ ప్రతినిధి రోహన్ బోస్ తెలిపారు. భారీ భవనాలు మొదలు కొని, వ్యక్తిగత ఇండ్లు, కార్యాలయాలు ఇలా ఎక్కడైనా వీటిని వినియోగించడం ద్వారా నేరుగా వచ్చే సూర్యరశ్మీ తీవ్రతను 90 శాతం వరకు తగ్గిస్తుందన్నారు.
వర్షపు నీటిని..
రెయిన్ వాటర్ ఫిల్టర్ టెక్నాలజీ విధానంతో అపార్ట్మెంట్స్, హాస్పిటల్స్ వంటి నిర్మాణాల వద్ద రెండు ఔట్లెట్లను ఏర్పాటు చేసినట్లయితే అందులో ఒకదాని నుంచి ఫిల్టర్ చేసిన నీరు, మరోవైపు డ్రైన్ వాటర్ వస్తుంది. ఫిల్టర్ చేసిన నీటిని సంపులోకి, బోర్ని రీచార్జ్ చేసేందుకు వాడుకోవచ్చు. దీని ద్వారా వర్షపు నీటిని కాపాడుకోవడంతో పాటు అపార్ట్మెంట్ పరిసరాల చుట్టూ నీరు నిల్వలు లేకుండా చూసుకోవచ్చు.
కాల్ చేస్తే..
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని అధికారులు రాంకీ ఇంజినీరింగ్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. 18001201159 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే స్వయంగా వారే వచ్చి నిర్మాణ వ్యర్థాలను తీసుకువెళ్తారు.
-కృష్ణ తేజ, శానిటేషన్ విభాగం అధికారి (జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం)
తక్కువ స్థలంలోనే..
బ్లూ డ్రాప్ ఎన్విరో సంస్థ నుంచి ఫోర్డ్స్ బెడ్ ఎరేషన్ టెక్నాలజీ పేరుతో తక్కువ స్థలంలోనే ఎక్కువ శుద్ధిని చేసే ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చాం. అపార్ట్మెంట్లో ఎన్ని కుటుంబాలు అయితే నివాసం ఉంటాయో అందుకు తగినట్లుగా అన్ని గజాల స్థలంలో ఈ టెక్నాలజీని ఏర్పాటు చేస్తాం.
– గంగాధర్‌రెడ్డి, బ్లూ డ్రాప్ ఎన్విరో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్
ఇంటి పై కప్పుపై..
రెయిన్ వాటర్ ఫిల్టర్ టెక్నాలజీతో ఇంటి పై కప్పు పై వర్షపు నీరు పైపుల ద్వారా ఫిల్టర్‌లో చేరుతుంది. ఆ నీరును రెండు రకాలుగా విడగొట్టి.. మంచి నీటిని ఒక వైపు.. మురుగు నీటిని ఔట్లెట్ ద్వారా బయటకు పంపేలా చేస్తుంది. సాధారణంగా పెద్ద అపార్ట్మెంట్లో రెండు ఫిల్టర్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
– సురేశ్, అల్ట్రాటెక్ కంపెనీ టెక్నికల్ మేనేజర్
టీఎస్ఐఐసీ ఒప్పందం
తెలంగాణ రాష్ట్రంలో హరిత భవనాల నిర్మాణాన్ని పెంచేందుకు సీఐఐ-ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్‌తో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ శనివారం ఒప్పందం చేసుకుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సదస్సులో టీఎస్ఐఐసీ వైఎస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి, ఐజీబీసీ చైర్మన్ గుర్మీత్ సింగ్ ఆరోరాతో కలిసి ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్రంలో టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలోనిర్మించే భవనాలు, ఇతర ప్రాజెక్టులన్నీ హరిత భవనాల ప్రమాణాలకు అనుగుణంగా ఉండేందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
సెన్సిబుల్ కూలింగ్‌తో 6 రెట్లు విద్యుత్ ఆదా
ప్రస్తుతం నగరాల్లో ఏసీల వినియోగం గణనీయంగా పెరిగింది. అయితే వీటిని వాడితే చాలా ఎక్కువ మొత్తంలో విద్యుత్‌ను వినియోగించాల్సి ఉంటుంది. అలాంటి ఏసీలకు ప్రత్యామ్నాయంగా యాంబియేటర్ సెన్సిబుల్ కూలింగ్ సిస్టంను రూపొందించారు. చర్లపల్లి కేంద్రంగా ఉత్పత్తి అవుతున్న యాంబియేటర్ సెన్సిబుల్ కూలింగ్ సిస్టంలను వ్యక్తిగత గృహాల నుంచి మొదలుకొని అపార్టుమెంట్లు, వ్యాపార భవనాల్లోనూ వినియోగించవచ్చు. సాధారణ కూలింగ్ యంత్రాల కంటే ఇది 6 రెట్లు తక్కువ విద్యుత్‌ను తీసుకొని చల్లదనాన్ని ఇస్తుందని తయారీదారుడు జితిన్ దేశాయ్ తెలిపారు.