ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర సర్కార్ అడుగులు వేస్తున్నది. అధునాతన సాఫ్ట్వేర్, కొత్త విధానాల వంకతో ‘ఉపాధి’ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నది. కేంద్ర సర్కార్ నిర్ణయంతో ఎంతోమంది కూలీలకు ఉపాధి పని కరువైంది. కూలీలు ఉదయం, సాయంత్రమూ పనులకు హాజరుకావాలని, రెండుపూటలా ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలనే నిబంధనలతో ఇటు కూలీలు, అటు సిబ్బంది అసౌకర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో చేపడుతున్న ఒక పని పూర్తైన తర్వాతనే మరో పనిని చేపట్టాలనే మార్గదర్శకాలతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. నిత్యం చేపడుతున్న పనులను ఎప్పటికప్పుడు యాప్‌లో పొందుపర్చాలని కేంద్రం నిర్ణయించింది.
క్షేత్రస్థాయిలో సిగ్నల్స్ సరిగా లేక.. ఫొటోలు అప్లోడ్ కాక సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రధానంగా తెలంగాణ సర్కార్ నిర్మిస్తున్న కల్లాల పనులను కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నుంచి తొలగించి సమస్య తీవ్రతను మరింత పెంచింది. వికారాబాద్ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి దాదాపు 17 లక్షల పనిదినాలు తగ్గాయి. అందులోనూ కేవలం 788 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పనిని కల్పించారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోనూ 20వేల పనిదినాలు తగ్గాయి. నిరుపేదల కడుపు నింపుతున్న ఉపాధి పథకంపై కేంద్రం అవలంబిస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
వికారాబాద్, అక్టోబర్ 15, (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలను తీసుకొచ్చారు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఆదానీలాంటి పెట్టుబడిదారులకు అప్పగించేలా ప్రైవేటుపరం చేస్తూ వస్తున్న మోదీ ప్రభుత్వం.. నిరుపేదల కడుపు నింపే ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నది.
ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే తనిఖీల పేరిట పనులను పరిశీలించిన కేంద్ర బృందాలు జరిగిన పనులకు భిన్నంగా తప్పుడు రిపోర్ట్‌లతో ‘ఉపాధి’ని పూర్తిగా నిలిపివేసే కుట్రపన్నాయి. దీంతో పనులనే నమ్ముకొని బతుకుతున్న కూలీలకు ‘ఉపాధి’ దూరమైంది. పనులను భారీగా తగ్గించిన కేంద్రం వేల కుటుంబాల కడుపు కొడుతున్నది. కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త నిర్ణయాలపై జిల్లావ్యాప్తంగా కూలీలంతా మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2,00,372 ఉపాధి హామీ కుటుంబాలుండగా, 4,38,398 మంది కూలీలు ఉన్నారు.
లక్షల కుటుంబాలకు‘ఉపాధి’ దూరం…
కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ సాఫ్ట్-ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తీసుకురావడంతో జిల్లాలోని లక్షల కుటుంబాలకు ‘ఉపాధి’ పనులు దూరమయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా పని దినాలు తగ్గాయి. కొత్త సాఫ్ట్వేర్ విధానంతో కూలీలు తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం పనులకు హాజరుకావాలని షరతులను విధించింది. కూలీలు చేస్తున్న పనులకు సంబంధించి ఉదయం 11 గంటల్లోపు ఒక ఫొటో, సాయంత్రం 2 గంటల తర్వాత రెండో ఫొటో తప్పనిసరిగా తీయడంతోపాటు అప్లోడ్ చేస్తున్నారు.
ఒక గ్రామంలో చేపడుతున్న ‘ఉపాధి’ పనులకు సంబంధించి ఒక పని పూర్తైన తర్వాతనే మరొక పని చేపట్టాలని నిబంధన విధించారు. దీంతో గతంలో మాదిరిగా కాకుండా పనులు చాలా ఆలస్యమవుతున్నాయి. ప్రతీరోజు చేపడుతున్న పనులను వెంటనే యాప్‌లో పొందుపర్చాలనే నిబంధనలతో క్షేత్రస్థాయిలో సిగ్నల్ లేకపోవడంతో అప్లోడ్ చేయడం ఇబ్బందిగా మారి పనులు కూడా జాప్యమవుతున్నాయి. మరోవైపు రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి ఏర్పాటు చేసిన కల్లాల ఏర్పాటు ప్రక్రియను కేంద్రం ‘ఉపాధి’ నుంచి తొలగించింది. గతేడాది ఇప్పటివరకు ఉపాధి హామీ పథకంలో భాగంగా 60.56 లక్షల పని దినాలను కూలీలకు కల్పించగా, ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 47.96 లక్షల పనిదినాలను మాత్రమే కల్పించారు.
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 17 లక్షల పని దినాలు తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిని కల్పించడమే లక్ష్యంగా పని చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఈ ఆర్థిక సంవత్సరం వేల కుటుంబాలకు పనులు దూరమయ్యాయి. గతేడాది ఇప్పటివరకు 12,921 ఉపాధి హామీ కుటుంబాలకు వంద రోజులపాటు పనులను కల్పించగా, ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు కేవలం 788 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని కల్పించారు. జిల్లాలోని వికారాబాద్, మర్పల్లి, కొడంగల్, బొంరాస్‌పేట మండలాల్లో 100 కుటుంబాలకుపైగా వంద రోజులపాటు పనిని కల్పించగా, మిగతా 16 మండలాల్లో సింగిల్, డబుల్ డిజిట్‌లోనే కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు.
కూలీలకు ‘కొత్త’ చిక్కులు
నూతన జాబ్‌కార్డులకు తిప్పలు
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 15 : ఉపాధి హామీ కూలీల పనిదినాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ విధానంతో కూలీలకు కొత్త చిక్కులొస్తున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో సాఫ్ట్వేర్ ఉండేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడం వల్ల కూలీలకు తిప్పలు మొదలయ్యాయి. ఏడాదికి 100 రోజుల పనిదినాలు కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ.. వివిధ కారణాల చేత పనిదినాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రంగారెడ్డిజిల్లాలో 18 మండలాల్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఈ మండలాల్లో 369 గ్రామపంచాయతీల్లో పనులు అమలవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1,35,900 జాబ్ కార్డులు ఉన్నాయి.
ఇందులో 3,25,426మంది కూలీలు ఉన్నారు. ఒక్కో జాబ్‌కార్డులో ముగ్గురు లేదా నలుగురు చొప్పున కూలీలు ఉన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఒక్క జాబ్‌కార్డు పేరు మీద వంద రోజుల పని మాత్రమే కల్పిస్తున్నది. జాబ్‌కార్డులోని నలుగురు పంచుకోవడం వల్ల కుటుంబానికి నెలకు 25 రోజులు మాత్రమే పని లభిస్తున్నది. మరోవైపు జాబ్‌కార్డులో ఉన్నవారు పెండ్లిళ్లు చేసుకుని కొత్తగా జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే సాఫ్ట్వేర్ సమస్యతో సకాలంలో అందడం లేదు. రంగారెడ్డి జిల్లాలో గత సంవత్సరం కంటే ఈ ఏడాది సుమారు 20వేల వరకు పనిదినాలు తగ్గినట్లు కూలీలు చెబుతున్నారు. గత సంవత్సరం 1.20లక్షల పనిదినాలుండగా, ఈ సంవత్సరం లక్ష పనిదినాలు మాత్రమే దొరికినట్లు కూలీలు చెబుతున్నారు. 2020 సంవత్సరం నుంచి క్రమంగా పనిదినాల సంఖ్య తగ్గుతూ వచ్చింది.
‘ఉపాధి’ని దెబ్బతీస్తున్న కొత్త సాఫ్ట్వేర్..
కూలీల ఉపాధిని దెబ్బతీసేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చింది. సాఫ్ట్‌వేర్‌లో చేసిన మార్పుల వల్ల కొత్త జాబ్ కార్డులు రాకపోగా పని దినాలు తగ్గాయి. సాఫ్ట్వేర్ పేరుతో కూలీల పొట్ట కొడుతున్న కేంద్ర ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి.
– జగన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి
కూలీ డబ్బులు సక్రమంగా అందడం లేదు..
ప్రతి రోజు కూలీ చేసుకుంటేనే కుటుంబం గడుస్తది. కొత్త విధానాలతో 100 రోజులు పని కల్పించకుండా కేంద్ర సర్కార్ కూలీల నోట్లో మట్టికొడుతుంది. చేసిన పనికైనా డబ్బులు సక్రమంగా అందడం లేదు. ఆఫీసుల చుట్టూ తిరిగాల్సి వస్తున్నది.
– ఇందిరా, ఉపాధి హామీ కూలీ, రంగారెడ్డి జిల్లా
కొత్త విధానంతో తగ్గిన పని దినాలు..
కొత్త విధానాలు కూలీలకు ఇబ్బందికరంగా మారాయి. పనులు చాలా వరకు తగ్గాయి. 20 పనులు మాత్రమే తీసుకోవాలనే నిబంధనతో గత ఏడాదితో పోలిస్తే భారీగా పని రోజులు తగ్గాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కూలీలు పని చేస్తున్న ఫొటోలు పంపడం వేసవి కాలంలో సాధ్యం కాదు.
– కృష్ణన్, వికారాబాద్ డీఆర్డీవో