రంగారెడ్డి, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలు.. అమ్మా అనే పిలుపు కోసం.. మరెన్నో ఇబ్బందులు, తొమ్మిది నెలల గర్భధారణ,, అనంతరం తల్లి కడుపుపై అనేక కత్తి గాట్లు.. తల్లికి ఒకానొక సందర్భంలో ప్రాణ సంకటం.. లక్షల రూపాయల వ్యయం.. ఇదంతా కార్పొరేట్ వ్యవస్థలో జరుగుతున్న వైనం. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుపేద మహిళలు ఇక్కట్లు పడొద్దని తలచింది. సగటు గర్భిణిని దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవిస్తూ.. వారి ఆరోగ్యం నిమిత్తం ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలను కల్పిస్తున్నది. వారికి సహజ సిద్ధమైన ప్రసవాలు జరిగేలా ప్రభుత్వం చేయూతనిస్తున్నది.
ఇందుకు సంబంధించి జిల్లాలోని వైద్యాధికారులు సహజ ప్రసవాలపై అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. జిల్లాలో డీఎం అండ్ హెచ్‌వో ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలపై క్యాంపులను నిర్వహిస్తూ మహిళలు, గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడిప్పుడే సహజ సిద్ధ ప్రసవాలపై మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ సౌలతులు, కిట్లను అందుకుంటున్న బాలింతలు సాధారణ కాన్పులకు జై కొడుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాకాలపై రేపటి తల్లులకు హితబోధ చేస్తున్నారు.
జిల్లాలో పెరుగుతున్న సాధారణ కాన్పులు
జిల్లావ్యాప్తంగా 51 వైద్య కేంద్రాలున్నాయి. గత సంవత్సరం స్వల్పంగా ఉన్న సాధారణ కాన్పుల సంఖ్య, ప్రస్తుతం గణనీయంగా పెరిగింది. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 3908 సాధారణ కాన్పులు జరిగాయి. 1762 సిజేరియన్ కాన్పులయ్యాయి. సిజేరియన్ కంటే సాధారణ కాన్పులు రెండింతలకు పైగా పెరిగాయి.
సిజేరియన్తో భవిష్యత్తులో ఇబ్బందులే..
అతి ప్రేమ, గారాభం వల్ల సాధారణ ప్రసవాలకు తల్లిదండ్రులు తమ పిల్లలను నిరాకరిస్తున్నారు. కాబోయే తల్లులు భయభ్రాంతులకు గురువుతున్నారని, తల్లిదండ్రులు పిల్లలను ఆ కాస్త నొప్పిని కూడా తట్టుకోలేకుండా పెంచి సిజేరియన్‌కు ప్రోత్సహిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. డబ్బు, ఆర్థిక స్థోమత ఉన్నవారు సిజేరియన్ వైపే మొగ్గు చూపుతున్నారని వైద్య నిఫుణులు పేర్కొంటున్నారు. సాధారణ ప్రసవమైతే ఒక గంట పాటు నొప్పి అంతే.. ఒక గంట పాటు నొప్పిని భరించలేని ఆ తల్లులు సిజేరియన్‌కు పోయి జీవితాంతం పలు రకాలైన ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. లేనిపోని రోగాలు, సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. సాధారణ ప్రసవాలకు మించిన ఔషధం మరోటి లేదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సాధారణ ప్రసవాలు పెంచేలా కృషి
– వెంకటేశ్వర్రావు, జిల్లా వైద్యాధికారి
జిల్లాలో ప్రసూతి దవాఖానలు గర్భిణులకు సకల సౌకర్యాలు అందిస్తూ.. అధునాతన వైద్య సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 45 శాతం గర్భిణులు సహజ సిద్ధ కాన్పులకే మొగ్గు చూపుతున్నారు. ఈ శాతాన్ని వచ్చే ఆరు నెలల్లో 65 శాతానికి పెంచేలా మా సిబ్బంది కృషి చేస్తున్నారు. గర్భిణుల కోసం మేము ఎన్నో క్యాంపులను నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నాం. ప్రైవేటు వైద్యులు గర్భిణులను ప్రలోభపెట్టి ధనార్జన నిమిత్తం బలవంతంగా సిజేరియన్ చేస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను మహిళలు అందిపుచ్చుకోవాలి.
సాధారణ ప్రసూతితోనే సంపూర్ణ ఆరోగ్యం
– ఒగ్గు మమత, ఆమనగల్లు
ప్రభుత్వ దవాఖానల్లో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను కల్పిస్తున్నది. సహజసిద్ధంగా ప్రసూతి జరిగేందుకు ప్రభుత్వం, అధికారుల కృషి సంతోషకరం. నార్మల్‌గా జరిగే ప్రసూతితో భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. ఇంకా కేసీఆర్ కిట్‌తోపాటు రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తున్నారు. దీంతోపాటు 16 రకాల వస్తువులు ఇవ్వడంతో తల్లీ బిడ్డకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.
సర్కారు దవాఖానల్లో పలు సదుపాయాలు
– సాబా, చేవెళ్ల
సర్కారు దవాఖానల్లో గర్భిణులకు వైద్య పరీక్షలు చేయడం.. ఏఏ మందులు ఎప్పుడు తీసుకోవాలి? పిల్లలకు టీకాలు ఎప్పుడు వేయించుకోవాలి? అనే సలహాలు డాక్టర్లు ఇస్తున్నరు. వైద్య సిబ్బంది మా ఇంటి దగ్గరికి వచ్చి దవాఖానకు తీసుకువెళ్లడం.. రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం చానా బాగుంది. కాన్పు అయిన తర్వాత మూడు రోజులు భోజనం ఏర్పాటు చేసిన్రు. ప్రసవానంతరం ఆశ వర్కర్లు మా ఇంటికి వచ్చి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటున్రు. ఇన్ని సౌలతులు అందించిన ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటం.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
– గౌరమ్మ, ఇన్ముల్‌నర్వ
కాన్పుల కోసం ప్రైవేట్ దవాఖానలకు వెళ్లాలంటే వేలకు వేలు ఫీజులు చెల్లించక తప్పదు. పేదింటి మహిళలు ఇబ్బందులు పడొద్దని సీఎం కేసీఆర్ సార్ సర్కారు దవాఖానల్లో సాధారణ కాన్పులు జరిగేలా అన్ని వసతులు కల్పించడం గొప్ప విషయం. చేవెళ్ల ఏరియా దవాఖానలో ఈ మధ్యనే నేను సాధారణ కాన్పు చేయించుకున్నాను. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయంతోపాటు కేసీఆర్ కిట్ ఇచ్చిన్రు. పెద్ద ఆపరేషన్ చేయించుకుంటే.. రేపు చానా కష్టపడాల్సి వస్తది. చానా ఆరోగ్య సమస్యలు వస్తయని ప్రభుత్వ డాక్టర్లు ఎన్నోసార్లు చెప్పిన్రు.
ప్రభుత్వ దవాఖానలో ప్రసవమే మేలు
– బోల్ల కావేరి, తలకొండపల్లి
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు శ్రేయస్కరం. వారానికోసారి ఆశ కార్యకర్తలు ఇంటి వద్దకే వచ్చి కాన్పయ్యే వరకు దవాఖానలకు దగ్గరుండి తీసుకెళ్తున్నారు. ప్రతి నెలలో రెండు నుంచి మూడుసార్లు డాక్టర్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తున్నారు. నార్మల్ డెలివరీ అయ్యేలా సలహాలు, సూచనలు ఇస్తున్నరు. అదే ప్రైవేట్ దవాఖానల్లో పైసల కోసం నార్మల్‌గా అయ్యే వారికి కూడా పెద్ద ఆపరేషన్ చేస్తున్నారు. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు ప్రభుత్వ దవాఖానలోనే పుట్టారు.