సంగారెడ్డి కలెక్టరేట్, జూలై2: ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పథకంలో జిల్లాలోని అసంఘటిత కార్మికులందరినీ ఎన్రోల్ చేయించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో కార్మికశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల పెన్షన్ పథకమైన ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్లో జిల్లా లక్ష్యం మేరకు అర్హులను ఈ నెల 15లోగా ఎన్రోల్ చేయించాలని సూచించారు.
ఈ పథకం కింద 18 నుంచి 40 ఏండ్ల లోపు వారు అర్హులన్నారు. వయస్సు ఆధారంగా రూ.55 నుంచి రూ.200 మధ్య జమ చేయాల్సి ఉంటుందన్నారు. సభ్యులు జమ చేసిన మొ త్తానికి కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. సంబంధిత కార్మికుడికి 60 సంవత్సరాల వయస్సు వచ్చినప్ప టి నుంచి జీవితకాలం ప్రతి నెలా రూ.3వేల పెన్షన్ వారి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఒక వేళ 60 ఏండ్లలోపు మరణిస్తే జమ అయి న మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారని తెలిపారు. కామన్ సర్వీస్ సెంటర్లో వెంటనే ఎన్రోల్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ పథకంలో జిల్లా లక్ష్యం 6,700 కాగా, ఇప్పటి వరకు 1000 మంది నమోదు అయ్యారని తెలిపారు. ఆయా సహాయ కార్మిక శాఖ అధికారులు ఈనెల 15లోగా నిర్ణీత లక్ష్యాన్ని సాధించేలా ప్రత్యేక చొరవ చూపాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, కార్మికశాఖ సహాయ కమిషనర్ బి జాన్సన్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆసక్తి గలవారి నుంచి ఆవిష్కరణలను ఆహ్వానిస్తున్నట్టు సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ జిల్లాలో ఆవిష్కరణల ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
అందులో భాగంగా ప్రతి ఇంటా ఉన్న ఆవిష్కర్తలు వారి సమస్యలకు పరిష్కారం సొం తంగా కనుగొనేలా ప్రోత్సహిస్తున్నదన్నారు. ఎంపికైన ఆవిష్కర్తలకు స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఆయా జిల్లాల్లో వారి ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు. ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాల వివరణ, 4 చిత్రాలు, 2 నిమిషాల వీడియో, ఆవిష్కరణ పేరు, వయస్సు, ప్రస్తుత వృత్తి, గ్రామం పేరు, జిల్లా పేరును 9100678543 నెంబరుకు వాట్సాప్ ద్వారా ఆగస్టు 5వ తేదీలోపు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ అధికారి 9963423691లో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.