కొందుర్గు : కొందుర్గు, జిల్లెడు దరిగూడ మండలంలోని ఆయా గ్రామాల్లో గల ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాధికారి సుషిందర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కొందుర్గు మండల కేంద్రంతో పాటు జిల్లెడు దరిగూడ మండలంలోని చేగిరెడ్డి ఘనాపూర్, దరిగూడ గ్రామాల్లో గల ప్రభుత్వ పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు బోధించే తీరు, మధ్యాహ్నా భోజన సౌకర్యం గురించి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆయన తెలిపారు. చేగిరెడ్డి ఘనాపూర్ గ్రామంలో పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని వస్తున్న కథనాలపై ఆయన స్పందించారు.
ప్రస్తుతం పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ఇప్పుడున్న భవనం సరిపోతుందన్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగితే నూతన భవనం కోసం కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.