రంగారెడ్డి, జనవరి 2 (నమస్తే తెలంగాణ)/అబ్దుల్లాపూర్మెట్ : అధికారులు కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలతో ముందుకు సాగి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో జిల్లాను ముందంజలో నిలపాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నూతన సంవత్సరం సందర్భంగా మాట్లాడారు.
అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి శాఖ పని తీరును మెరుగుపర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. కాగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్, మండల పంచాయతీ అధికారుల అసోసియేషన్ సహకారంతో హాస్టళ్లలోని విద్యార్థుల కోసం 200 బ్లాంకెట్స్, 100 నోట్ పుస్తకాలను కలెక్టర్కు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్వో సంగీత, జిల్లా అధికారులు, రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేందర్, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, రాజేశ్, శశిధర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఆదిబట్ల : తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయం సనత్నగర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చొద్దు’ అంశంపై రూపొందించిన పోస్టర్లను రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్తను కాల్చడంద్వారా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందన్నారు. రోజువారీ తడి చెత్తను కంపోస్ట్ ఎరువుగా, పొడి చెత్తను రీసైక్లింగ్ చేయాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెట్లను పెంచి పర్యావరణాన్ని రక్షించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ ప్రాజెక్ట్ అధికారి నాగేశ్వర్రావు ఉన్నారు.