షాద్‌నగర్, సెప్టెంబర్7: పూల తోటలు సాగు చేసే రైతులకు పాత రోజులు మళ్లీ రాబోతున్నాయి. సంవత్సరంన్నర నుంచి కరోనా ప్రభావంతో పెండ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు జరుగకపోవడంతో పూల ధరలు పతనం కావడంతో పూల తోటల సాగును స్థానిక రైతులు వదిలేశారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో పాటు తిరిగి శుభకార్యాయాలు ఊపందుకోవడంతో మళ్లీ రైతులు పూల సాగు బాట పట్టారు.
పూలసాగులో అగ్రస్థానం
ఉద్యానవన పంటలో ప్రధాన పంటలుగా పలు రకాల పూల తోటలను రంగారెడ్డి జిల్లాలో 4వేల 82 ఎకరాల విస్తీర్ణంలో 3 వేల 222 మంది రైతులు సాగుచేస్తున్నారు. గ్రామీణ ప్రాంత రైతులతో పాటు హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న పట్టణ ప్రాంతాల రైతులు కూడా పూలతోటలను సాగుచేస్తున్నారు. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, మహేశ్వరం, శంషాబాద్, కొత్తూరు, కేశంపేట, ఫరూఖ్‌నగర్ మండలాల రైతులు పూల తోటలను విస్తృతంగా సాగుచేస్తూ లబ్ధిపొందుతున్నారు.రాజధానికి రవాణా సౌకర్యం అందుబాటులో ఉండడంతో ఇక్కడి రైతులు కూరగాయల సాగుతో పాటు పూల సాగుపైన కూడా ఆసకి ్తచూపుతున్నారు. కాలానుగుణంగానే కాకుండా ఇతర ప్రాంతాలకు అవసరమయ్యే పూలను ఇక్కడి రైతులు సాగుచేస్తున్నారు. చామంతి, బంతి, హస్టర్, జర్బార, గులాబీ, హైబ్రిడ్ గులాబీ, టైగర్ గులాబీ, కనకాంబరాలు, ముద్ద చామంతి పూల తోటలతో పాటు బొకె పిల్లర్ గ్రాస్, అస్పారస్ గ్రాస్ వంటి ఉద్యాన పంటలను పండిస్తున్నారు. నిత్యం లక్షల విలువ చేసే పలు రకాల పువ్వులు రాష్ట్ర రాజధానిలోని గుడిమల్కాపూర్, జాంబాగ్ మార్కెట్లకు తరలిలిస్తారు. వందలాది మంది రైతులతో పాటు దినసరి కూలీలు, వ్యాపారులు, డెకరేషన్ కార్మికులు పూల సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా అన్ని ప్రాం తాల్లో యువ రైతులు పూలసాగుపై దృష్టి సారిస్తున్నారు.
పూల ధరలకు రెక్కలు
పూల సాగుపై ఆధారపడిన రైతులు గత కొన్నేండ్లుగా నష్టాలను చవిచూడలేదు. సాధారణ రోజుల్లో కూడా పూల ధరలు రైతులకు గిట్టుబాటు ఉండేది.పైగా ఇక్కడి వాతావరణం కూడా అనుకూలించడంతో పూల ఉత్పత్తి పెరిగింది. అయితే గత మార్చిలో పుట్టుకొచ్చిన కరోనా రైతుల పాలిట పిడుగుగా మారింది. ఏడాదిన్నర కాలంగా పూల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు శుభకార్యాలు, పర్వదినాలు రావడంతో పూల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గతంతో పోలిస్తే అన్ని రకాల పూల ధరలు పెరిగాయి. మూడు నెలల నుంచి పూల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. జర్బార పూల కట్ట రూ. 110 నుంచి రూ. 200 వరకు ధర పలుకుతున్నది. కిలో గులాబీ సాధారణంగా రూ. 160 నుంచి 200,గులాబీ పువ్వుల కట్ట రూ. 150, చామంతి కిలో రూ.180 నుంచి రూ. 250, కనకాంబరాలు కిలో రూ. 800, బంతి కిలో రూ. 40, మల్లె కిలో రూ. 180 నుంచి 230, బొండు మల్లె కిలో రూ. 200, హస్టల్ పూలు కిలో రూ. 150, లిల్లీ పూలు కిలో రూ. 180 నుంచి 300 వరకు ప్రస్తుత మార్కెట్లో రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. అదే విధంగా డెకరేషన్‌కు వినియోగించే అస్పారస్ గడ్డి కట్ట రూ. 60 పలుకుతున్నది. కరోనా కారణంగా కొన్నేండ్లుగా నష్టపోయిన పూల రైతులు ప్రస్తుతం కో లుకుంటున్నారు. వినాయక చవితి మొ దలుకొని దీపావళి, కార్తీక మాసం వరకు పూలకు డిమాండ్ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
మంచి ధర వస్తున్నది
మేము చాలా యేండ్ల నుంచి పూలతోటలను సాగుచేస్తున్నాం.. కరోనా కారణంగా చాలా నష్టపోయాం.. మార్కెట్‌కు పోతే ఎవరూ పూలను కొనేవాళ్లు కాదు. కానీ కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే పూలకు మంచి ధర వస్తున్నది. మేము బంతి, చామంతి పూలను పండిస్తాం. స్థానికంగా ఉండే వ్యాపారులతో పాటు హైదరాబాద్ మార్కెట్లో అమ్ముతాము. ధరలు ఇట్లనే ఉంటే రైతుకు కొంత గిట్టుబాటైతది.
-మల్లేశ్, పూల సాగు రైతు, కొండన్నగూడ, ఫరూఖ్‌నగర్ మండలం