వికారాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): జిల్లాలో వానకాలం పంటల సాగు విస్తీర్ణం ఇప్పటివరకు మూడు లక్షల ఎకరాలు దాటింది. ఈ నెల మొదటి వారం నుంచి వర్షాలు కురుస్తుండడంతో ఆయా పంటల సాగు జోరందుకున్నది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా జిల్లా రైతాంగం పత్తి పంట సాగువైపే మొగ్గు చూపుతున్నది. ఇప్పటివరకు సాగైన ఆయా పంటల్లో 75 శాతం మేర పత్తినే సాగు చేశారు.
ఈ నెలాఖరు వరకు పత్తి, కంది పంటలు సాగు చేసేందుకు అనుకూలమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అనంతరం సాగు చేసినట్లయితే దిగుబడిపై ప్రభావం పడే అవకాశమున్నదని సూచిస్తున్నారు. ఇక వరితోపాటు మిగతా పంటలు ఆగస్టు రెండో వారం వరకు సాగు చేసుకోవచ్చన్నారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా జిల్లా వ్యవసాయ శాఖ అవసరమైన చర్యలు చేపట్టింది. 20 రోజుల క్రితమే పంటల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభంకాగా, ఇప్పటివరకు 1.50 లక్షల ఎకరాల్లోని పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు.
జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 3,17,594 ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా జిల్లా రైతాంగం పత్తి పంట సాగువైపే మొగ్గు చూపుతుండడం గమనార్హం. జిల్లాలో ఈ వానకాలంలో 5.97 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతున్నాయని జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికను రూపొందించారు. పత్తి 2,63,500 ఎకరాలు, కంది 1.50 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 50,450 ఎకరాలు, వరి 1.10 లక్షల ఎకరాలు,
మినుములు 5 వేల ఎకరాలు, సోయాబీన్ 2500 ఎకరాలు, జొన్నలు-2500 ఎకరాలు, పెసర్లు 13 వేల ఎకరాల్లో సాగవుతున్నట్లు అంచనా వేశారు. ఇప్పటివరకు 3,17,594 ఎకరాల్లో ఆయా పంటలు సాగు కాగా, పత్తి-1,97,654 ఎకరాలు, వరి-2872 ఎకరాలు, మొక్కజొన్న 14,563 ఎకరాలు, కందులు-79,574 ఎకరాలు, జొన్న 922 ఎకరాలు, మినుములు-4876 ఎకరాలు, పెసర్లు 8462 ఎకరాలు, సోయాబీన్-1900 ఎకరాలు, బఠానీ-610, ఆముదం-25 ఎకరాలు, పొద్దుతిరుగుడు-2725, దైంచా-2519 ఎకరాల్లో రైతులు సాగు చేశారు.
జిల్లా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఏఈవోలు క్షేత్రస్థాయిలో పంటల సర్వే నిర్వహిస్తుండడంతో ఎరువులు, విత్తనాలు ఎంతమేర అవసరమనేది ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. యూరియా, డీఏపీ, ఎన్పీకేఎస్, ఎంవోపీ, ఎస్ఎస్పీ ఎరువులు అన్నీ కలిపి 75,437 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా యూరియా 32,329 మెట్రిక్ టన్నులు, డీఏపీ 17,719 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 19,877 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 3658 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 1854 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని సంబంధిత శాఖ అధికారులు అంచనా వేయగా,
జిల్లాలో ఇప్పటివరకు యూరియా 15,317 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1273 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 2477 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 192 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 106 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలోని గోదాముల్లో నిల్వ ఉంచారు. జిల్లాలో పీఏసీఎస్, డీలర్లు, కంపెనీ గోదాంలు, మార్క్‌ఫెడ్, వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల ద్వారానే ఎరువులు సరఫరా అవుతున్నాయి. ఎరువుల విక్రయ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా జిల్లాయంత్రాంగం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. స్టాక్ పాయింట్ నుంచి జిల్లాకు ఎంత సరఫరా అయ్యింది, జిల్లాలోని స్టాక్ పాయింట్ ద్వారా ఆయా ఎరువుల దుకాణాలను ఎంతమేర ఎరువులు సరఫరా అయ్యాయనే వివరాలతోపాటు జిల్లాలోని ఎరువుల దుకాణాల నుంచి రైతులు ఎంతమేర కొనుగోలు చేశారనే పూర్తి వివరాలు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నది.
ఈ సీజన్‌కు సంబంధించి ఆయా పంటల సాగు విస్తృతంగా సాగుతున్నది. ఇప్పటివరకు సాగైన పంటల్లో అధికంగా పత్తి పంటనే సాగు చేశారు. ఈ నెలాఖరు వరకు పత్తి, కంది పంటలను సాగు చేసుకునేందుకు అనుకూలం. మిగతా పంటలు ఆగస్టు రెండో వారం వరకు విత్తనాలను నాటుకోవచ్చు. జిల్లావ్యాప్తంగా సరిపడా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాం.
– గోపాల్, వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి