రంగారెడ్డి, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): ఈ ఏడాది రైతాంగానికి అంతగా కలిసి రావడం లేదు. గత యాసంగిలో అనావృష్టి పరిస్థితులతో నష్టాలను చవి చూసిన జిల్లా రైతాంగానికి వానకాలం సాగు సైతం ప్రతికూలంగా మారింది. వర్షాలు విస్తారంగా కురుస్తున్నట్లు కనిపిస్తున్నా.. రంగారెడ్డి జిల్లాలో మాత్రం సరైన వర్షాలు లేవు.
వానకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా సరైన వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1.82లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. చెరువుల్లోకి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో నీరు చేరలేదు. ఇప్పటికే వరి నార్లు పోసిన రైతులు రోజూ చెరువుల వైపు చూస్తున్నారు. గత పరిస్థితుల దృష్ట్యా వరిసాగుకు వెనుకడుగు వేయాల్సి వస్తున్నది.
గణనీయంగా తగ్గనున్న సాగు విస్తీర్ణం..
వానకాలం సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గనున్నట్లు తెలుస్తున్నది. జిల్లాలో ఈసారి 2.94లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ.. ఇప్పటివరకు 1,82,334 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. లక్ష ఎకరాల్లో వరి సాగు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 19,500 ఎకరాల్లోనే సాగును మొదలుపెట్టారు. మరో 20,795 ఎకరాల్లో నారును సిద్ధ్దం చేసి ఉంచారు.
జిల్లాలో ఉన్న చెరువుల్లోకి సైతం ఆశించిన స్థాయిలో వరద నీరు రాలేదు. దీంతో మత్తడి పోసిన చెరువులు ప్రస్తుతానికైతే లేవు. దీంతో నార్లు పోసిన రైతులు సైతం సందిగ్ధంలో ఉన్నారు. జిల్లాలో బావులు, బోర్ల కింద వరి సాగు చేస్తున్న రైతులు ఈసారి సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకుంటున్నారు. అత్యధికంగా పత్తి సాగు చేపట్టనున్నారు. పత్తిని 1.77లక్షల ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 1.10లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. సీజన్ ముగిసేనాటికి 2 లక్షల ఎకరాలకు మించి పంటలు సాగయ్యే అవకాశం కనిపించడం లేదు. గత వానకాలంతో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గనున్నది.
ఆగస్టుపైనే ఆశలు..
ఈ ఏడాది జిల్లాలో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఆమనగల్లు, తలకొండపల్లి, కేశంపేట మండలాల్లో మాత్రమే సాధారణం కంటే కొంత ఎక్కువ వర్షపాతం నమోదైంది. శంకర్పల్లి, శేరిలింగంపల్లి, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, మంచాల, మాడ్గుల, కడ్తాల్, మహేశ్వరం, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, చౌదరిగూడెం మండలాల్లో సాధారణ వర్షమే కురిసింది.
గండిపేట, రాజేంద్రనగర్, బాలాపూర్, సరూర్‌నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూరు, శంషాబాద్ మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జూలై నాటికి 246.9 మి.మి.ల వర్షపాతం కురవాల్సి ఉండగా.. 201.0మి.మీ.లు మాత్రమే కురిసింది. సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు పెరగలేదు. వ్యవసాయ బోర్లు సైతం రీఛార్జ్ కాలేదు. గత మే నెలలో 14.06 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు జూన్ నాటికి 13.99మీ.కి మాత్రమే పెరిగాయి. రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తే.. రాష్ట్ర సగటు కంటే అధికంగా వానలు పడ్డట్లు కనిపిస్తున్నా.. జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఇక రైతులు ఆగస్టు నెలలో కురిసే వర్షాలపైనే ఆశలు పెట్టుకున్నారు.
జిల్లాలో సాగు వివరాలు..
పంట : ఎకరాల్లో
వరి : 19,500
పత్తి : 1,10,563
జొన్నలు : 2,913
మొక్కజొన్న: 27,055
కందులు : 5,009
మినుములు : 18
పెసలు : 14
చెరుకు : 34
సోయాబిన్ : 17
ఇతర పంటలు : 17,211