సిటీబ్యూరో, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ): రోబోటిక్ సర్జరీలు వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తేవడమే కాకుండా రోగులకు మరింత మెరుగైన వైద్యం అందిస్తాయని ఎడిన్‌బర్గ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ప్రొఫెసర్ రోవన్ పార్క్స్ అన్నారు. ‘ప్రాథమిక స్థాయి నుంచి అభివృద్ధి చెందిన రోబోటిక్ సర్జరీ’ అనే థీమ్‌తో రామోజీఫిల్మ్‌సిటీలో ఏర్పాటు చేసిన 2వ అంతర్జాతీయ ‘అడ్వాన్స్డ్ రోబోటిక్ ఇన్నోవేషన్ సర్జరీస్’ సదస్సుకు ప్రొఫెసర్ రోవన్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోబోటిక్, విన్నూత్న శస్త్రచికిత్సల్లో ఉన్న పురాతన అంశాలకు, ఆధునిక అడ్వాన్స్మెంట్స్కి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇంటరాక్టివ్ వర్క్ షాప్‌లు,మేధోమథనం, ట్రైనింగ్ సెషన్లతోపాటు ఎంతో ఆలోచింపజేసే చర్చల ద్వారా, నైపుణ్యాలు, జ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఈ సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు.
రోబోటిక్ సర్జరీ అనేది సాధారణంగా జరిపే లాప్రోస్కోపిక్ సర్జరీల కన్నా అత్యుత్తమమైన టెక్నాలజీతో రూపొందించడం జరిగిందన్నారు. సంస్కృతి, వారసత్వం, టెక్నాలజీ పరంగా ఎంతో ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ నగరంలో ఈ సదస్సును నిర్వహించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్ జగదీశ్వర్ గౌడ్, సెక్రటరీ డా.బాలవికాస్ మాట్లాడుతూ.. ఇన్నోవేటివ్ సర్జన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సు ఈనెల 18నుంచి 20వరకు 3రోజులపాటు జరుగుతుందన్నారు.
ఈ సదస్సు వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్జన్లు, పరిశోధకులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు తదితరులందరినీ ఒకచోట చేర్చడం జరిగిందన్నారు. ఈ సదస్సులో వివిద దేశాల నుంచి ఆయా విభాగాలకు చెందిన 700 మంది వైద్యనిపుణులు పాల్గొన్నారన్నారు. సదస్సులో భాగంగా అపోలో హాస్పిటల్ నుంచి లైవ్ సర్జరీలను నిర్వహించడం జరుగుతుందని డా. బాలవికాస్, డా.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండింగ్ ప్రెసిడెంట్ డా.సుభాష్ కన్నా, చీఫ్ అడ్వైజర్ డా. సురేశ్ చంద్ర, ఆర్గనైజింగ్ చైర్మన్ జగదీశ్వర్ గౌడ్, స్రెకటరీ డా. బాలవికాస్, ట్రెజరర్ డా. కృష్ణ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.