మొయినాబాద్, జనవరి 11: మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు రెవెన్యూలోని శ్రీ చిలుకూరు భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వేద పండితులు మంత్రోచ్ఛరణలతో కన్నులపండువగా జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున బోనాలను స్వామివారికి సమర్పించారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల మధ్య అంగరంగ వైభవంగా బోనాల ఊరేగింపు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలను పునస్కరించుకొని ఆలయం ముందు భాగంలో అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. శివసత్తులు, పోతురాజులు భక్తిపారవశ్యంతో ఈ అగ్ని గుండాలను తొక్కారు. గత మూడు రోజులుగా సంబురంగా సాగుతున్న ఈ బ్రహ్మోత్సవాల్లో రాజకీయ ప్రముఖులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కే.ఎస్ రత్నం, భీమ్ భరత్ తదితరులు స్వామివారిని ఆశీస్సులు తీసుకున్నారు.
కల్యాణ మహోత్సవంలో ఆలయ చైర్మన్ సంగేరి మల్లేష్, సభ్యులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా చేవెళ్ల జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్ (DCP Yogesh Gowtham) ఆధ్వర్యంలో మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.