ఇబ్రహీంపట్నం రూరల్, జనవరి 12 : ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగిన పాపానికి దాడులు చేస్తారా..? అని బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్‌కుమార్, బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు ఏనుగు భరత్‌రెడ్డి, బీఆర్ఎస్వీ నాయకుడు శివసాయిలు ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై ఎన్ఎస్యూఐ నాయకులు చేసిన దాడికి నిరసనగా వారు అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వగా.. పోలీసులు రాజ్‌కుమార్, బుగ్గరాములు, భరత్‌రెడ్డి, శివసాయి లు తదితరులను ముందస్తుగా అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హామీలను అమలు చేయాలని అడిగితే బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడులు చేయడం సరైంది కాదని, ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
పెద్దఅంబర్‌పేట : భువనగిరిలో బీఆర్ఎస్ మహాధర్నా నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలోని పలువురు బీఆర్ఎస్ నాయకులను నాగోల్ పోలీసులు ఆదివారం ముందస్తుగా అరెస్టు చేశారు. నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ నాయకుల దాడి హేయమైనదని, మరోసారి ఇలాంటివి జరిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ముందస్తు అరెస్టు అయినవారిలో బీఆర్ఎస్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి దామోదర్, పార్టీ నాయకులు కౌన్సిలర్ పరశురాంనాయక్, గౌరెల్లి మాజీ సర్పంచ్ మల్లేశ్, సీనియర్ నాయకులున్నారు.
యాచారం : అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఖాజా మహ్మద్ అన్నారు. భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ గూండాల దాడిని ఖండిస్తూ ఆదివారం నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వగా.. పోలీసులు పలువురు బీఆర్ఎస్ నాయకులను ఆదివారం ముందస్తుగా అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలనలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా..? అని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. కార్యాలయంపై దాడి చేసి కుర్చీలు విరగ్గొట్టి, కేసీఆర్ ఫ్లెక్సీలను చించేసిన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఖబడ్దార్ కాంగ్రెస్ గూండాల్లారా.. బీఆర్ఎస్ జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు యాదయ్య, వెంకటేశ్ ఉన్నారు.
మంచాల : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిచేసిన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పార్టీ మంచాల మండలాధ్యక్షుడు చీరాల రమేశ్ అన్నారు. ఆదివారం పార్టీ మండల కార్యదర్శి కాట్రోత్ బహదూర్, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య ఇతర సీనియర్ నాయకులతో కలిసి ఆయన మంచాలలో విలేకరులతో మాట్లాడారు. దాడులను ప్రోత్సహిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? అని ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సింగ్, వెంకటేశ్‌గౌడ్, రఘుపతి, శేఖర్, బద్రీనాథ్, విజయ్, కిషన్‌రెడ్డి, యాదయ్య, జానీపాషా, వెంకటేశ్, శేఖర్‌గౌడ్ తదితరులున్నారు.