మొయినాబాద్, జూలై 10 : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో గురువారం పోలీసులు జేసీబీ సాయంతో మద్యం సీసాలను ధ్వంసం చేశారు. పలుచోట్ల వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం బాటిళ్లను అబ్కారీ శాఖ ఆదేశానుసారం రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, అదనపు డీసీపీ విజయ్‌కుమార్, అబ్కారీ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డిల ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. సుమారు 8551 లీటర్ల మద్యాన్ని నామరూపాలు లేకుండా చేశారు.
అబ్కారి శాఖ అనుమతులు లేకుండా అక్రమ మద్యాన్ని విక్రయిస్తే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ అదనపు డీసీపీ విజయ్‌కుమార్ ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, అబ్కారీ శాఖ సీఐ ప్రదీప్‌కుమార్, పోలీసులు పాల్గొన్నారు.