రంగారెడ్డి, జూన్ 18 (నమస్తేతెలంగాణ): ఫార్మాసిటీ పరిధిలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా? అన్ని గ్రామాల మాదిరిగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలను సర్కారు నిర్వహిస్తుందా? లేదా? అన్న సంశయం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఫార్మాసిటీ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో నెలకొన్నది. ఇప్పటికే త్వరలో సర్కారు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొన్నది.
ఫార్మాసిటీ పరిధిలోని గ్రామాల్లో మాత్రం ఇంకా స్పష్టత రాకపోవడంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ ప్రభుత్వం ఫార్మాసిటీ డెవలప్మెంట్ అథారిటీని ప్రకటించింది. అథారిటీకి ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా కూడా నియమించింది. ఫార్మాసిటీని ప్రత్యేక కార్పొరేషన్‌గా ప్రకటించిన నేపథ్యంలో ఆ గ్రామాల పరిధిలో ఎన్నికలపై సందిగ్ధత నెలకొన్నది. ఫార్మాసిటీ అథారిటీలో ఉన్న గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై సాధ్యాసాధ్యాలపై అధికారులు యోచిస్తున్నారు.
ఫార్మాసిటీ పరిధిలోని గ్రామాలు ఇవే..
రంగారెడ్డి జిల్లాలో 7 మండలాలు, 56 గ్రామాలు ఫార్మాసిటీ పరిధిలోకి వస్తాయి. ఆమనగల్లు మండలంలోని కోనాపూర్, రానుంతల, ఇబ్రహీంపట్నం మండలం కప్పాడు, పోచారం, తులేకలాన్, తుర్కగూడ, ఎలిమినేడు, కడ్తాల్ మండలం చరికొండ, కడ్తాల్, కర్కల్‌పహాడ్, ముద్విన్, కందుకూరు మండలంలోని దాసర్లపల్లి, అన్నోజిగూడ, గూడూరు, దెబ్బడగూడ, గుమ్మడవెల్లి, కందుకూరు, కొత్తూరు, లేమూర్, మాదాపూర్, మీరఖాన్‌పేట్, ముచ్చర్ల, రాచులూరు, తిమ్మాయిపల్లి, తిమ్మాపూర్, మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు, మహబత్నగర్, మంచాల మండలంలోని ఆగాపల్లి, నోముల, యాచారం మండలంలోని చౌదర్పల్లి, గున్గల్, కొత్తపల్లి, కుర్మిద్ద, మేడిపల్లి, మల్కీజ్‌గూడ, నందివనపర్తి, నజ్దిక్‌సింగారం, తక్కళ్లపల్లి, తాటిపర్తి, తులేఖర్దు, యాచారం, చింతపట్ల, నల్లవెల్లి ఈ గ్రామపంచాయతీలన్ని ఫ్యూచర్‌సిటి అథారిటీలోకి వెళ్లాయి.
ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాయకులు
ఫార్మాసిటీ పరిధిలోని 7 మండలాల్లోని వివిధ గ్రామ పంచాయతీలకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆయా గ్రామాల పరిధిలోని నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న అనుమానంలో ఉన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని వారంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపొందాలన్న పట్టుదలతో వారంతా ఉన్నారు. ఈ పరిస్థితిలో ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకోవడంతో ఆశావహులు అయోమయంలో పడ్డారు. ఫార్మాసిటీ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్పడితే జిల్లాలో మరో రెండు జడ్పీటీసీ స్థానాలు తగ్గనున్నాయి.