కొడంగల్, ఫిబ్రవరి 21 : పోలేపల్లి ఎల్లమ్మ తల్లీ.. సీఎం రేవంత్‌రెడ్డి బుద్ధి మార్చి ప్రజా సంక్షేమానికి పాటుపడే మనసు ప్రసాదించాలని మా జీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కోరుకున్నారు. శుక్రవారం ఆయన దుద్యాల మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ తల్లి జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
రైతులు, ప్రజలపై కరుణను చూపాలని.. సమృద్ధిగా వర్షా లు కురిసి ఆశించిన మేర పంటలు పండి అం దరూ సంతోషంగా ఉండాలని, అదేవిధంగా సీఎం బుద్ధిని మార్చి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా మంచి మనసు ఇవ్వాలని ఆ తల్లిని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి.. ఏ ఒక్క హామీనీ సక్రమంగా అమలు చేయడంలేదని మండిపడ్డారు. రైతుభరోసా అందక, రైతుబీమా అమలు కాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
అరకొరగా రైతు రుణాలను మాఫీ చేయడంతో వేలా ది మంది అన్నదాతలకు అప్పుల నుంచి విముక్తి లభించలేదన్నారు. 14 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని.. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల వారు కోరుకుంటున్నారన్నారు. ఆలయాన్ని దర్శించుకున్న సీఎం ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా రూ. 25 కోట్లు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చాంద్‌పాషా, విష్ణువర్ధన్‌రెడ్డి, నారాయణరెడ్డి, కోట్ల యాదగిరి, భీములు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.