మర్పల్లి, డిసెంబర్ 7 : తెల్లటి ఆకారంలో ఉన్న ఓ శకటం బుధవారం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని మొగిలిగుండ్లలోని ప్రసాద్‌రావు పొలంలో దిగింది. విషయాన్ని తెలుసుకున్న మండలంలోని ప్రజలు వింత శకటాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అచ్చం ఆదిత్య 369 మూవీలోని టైం మెషీన్‌ను తలపించడంతో అది ఏలియన్ షిప్ అయ్యుంటుందని ప్రచారం జరిగింది. అది వెదర్ రీసెర్చ్ బెలూన్ అని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని నేషనల్ బెలూన్ ఫెసిలిటీ అనే సంస్థ దాన్ని వాతావరణ పరిశోధన కోసం ఆకాశంలోకి పంపినట్లు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ తెలిపారు. వెయ్యి కేజీల హీలియం గ్యాస్‌తో కూడిన బెలూన్ అని, దాదాపు 35 కిలోమీటర్ల ఎత్తులో ఆకాశంలోకి ప్రయాణించి అక్కడి విలువైన సమాచారాన్ని సేకరిస్తుందని తెలిపారు.
పరిశోధన కోసం ఉపయోగించిన బెలూన్
– ఈసీఐఎల్ శాఖ సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్‌రెడ్డి
వాతావరణ పరిశోధన శాస్త్రవేత్తలకు అనుకూలంగా భవిష్యత్తులో హైడ్రోజన్ బెలూన్లు తయారు చేస్తామని.. అందులో భాగంగానే హైదరాబాద్ వేదికగా బెలూన్ ఫెసిలిటీ ఆఫ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఈసీఐఎల్ నుంచి అపరేట్ చేస్తూ గూగుల్ మ్యాప్ ద్వారా పరిశోధన కోసం బుధవారం ఉదయం 5:30 గంటలకు ప్రారంభించామన్నారు. సంగారెడ్డి మీదుగా మునిపల్లి మండలం కంబాలపల్లి గ్రామ సమీపంలో 35 కిలోమీటర్ల కంటే ఎత్తులో పోతుండటంతో మొగిలిగుండ్ల సమీపంలో 9.30కు ల్యాండ్ అయ్యేలా అపరేట్ చేశామన్నారు. దీనివల్ల ఎవ్వరూ ఆందోళన చెందవద్దని.. ఎలాంటి ఇబ్బందులు ఉండవని మోమిన్‌పేట్ సీఐ వెంకటేశం, తహసీల్దార్ శ్రీధర్‌తో ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. సిబ్బంది ప్రసాద్, సంపత్ ఇతర సిబ్బందితో కలిసి బెలూన్ భాగాలను విడదీసి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.